Saudi Arabia, March 13: అరబ్ దేశం సౌదీ అరేబియాలో (Saudi Arabia) సంచలనం చోటుచేసుకుంది. వివిధ నేరాల్లో శిక్షపడ్డ 81 మందికి నిర్దాక్షిణ్యంగా మరణశిక్ష విధించింది సౌదీ ప్రభుత్వం. సౌదీ అరేబియా రాజ్యంలో(Kingdom of Saudi Arabia) ఆధునిక చరిత్రలోనే ఒకేసారి సామూహికంగా 81 మందికి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్షకు గురైనవారిలో 73 మంది సౌదీ దేశస్తులు కాగా, ఏడుగురు యెమెన్లు (Yemans), ఒక సిరియా (Syria) దేశస్తుడు ఉన్నారు. మరణశిక్షల గురించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సౌదీ ప్రెస్ ఏజెన్సీ శనివారం వివరాలు వెల్లడించింది. ఉరితీయబడిన నేరస్తులు.. “అమాయక పురుషులు, మహిళలు మరియు పిల్లలను హత్య చేయడంతో సహా వివిధ నేరాలకు పాల్పడ్డారు. నిందితుల్లో కొందరు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు మరియు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులు” కూడా ఉన్నారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది.
శిక్షా సమయంలో నిందితులకు ప్రభుత్వం పరంగా న్యాయపరమైన హక్కు అందించామని, న్యాయ ప్రక్రియలో సౌదీ చట్టం ప్రకారం వారి పూర్తి హక్కులకు హామీ ఇచ్చినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. ఉరిశిక్షకు గురైన వారు పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభుత్వ అధికారులను హతమార్చడం సహా ఎన్నో క్రూరమైన నేరాలకు పాల్పడ్డారని సౌదీ (saudi) ప్రభుత్వాధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులకి సైతం మరణశిక్ష విధించడంతో “మొత్తం ప్రపంచం యొక్క స్థిరత్వాన్ని బెదిరించే ఉగ్రవాదం మరియు తీవ్రవాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సౌదీ రాజ్యం కఠినమైన వైఖరిని కొనసాగిస్తుంది” అనే సందేశాన్ని ఇస్తున్నట్లు సౌదీ మీడియా వెల్లడించింది.
81 మందికి సామూహికంగా మరణశిక్ష విధించడం సౌదీ అరేబియా (Saudi Arabia) రాజ్య చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో 1979-80 మధ్యన మక్కా మసీదును స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన 63 మందిని శిరచ్ఛేదన చేసింది సౌదీ ప్రభుత్వం. అనంతరం 2016లో 47 మందిని, 2019లో 37 మందిని సామూహికంగా మరణశిక్ష విధించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. అయితే ప్రస్తుతం విధించిన మరణశిక్షలు ఎప్పుడు ఎక్కడ ఎలా విదించారనే విషయాన్నీ మాత్రం మీడియాగాని, సౌదీ అధికారులు గానీ వెల్లడించలేదు.