Colombo, April 1: పెరిగిన ధరలు, ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శ్రీలంక ప్రజలు ఏకంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవదీశారు. ప్రస్తుత పరిస్థితులకు (Sri Lanka economic crisis) పూర్తి బాధ్యత వహిస్తూ.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయా రాజపక్సే వెంటనే పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 5,000 మంది నిరసనకారులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పెద్ద ఎత్తున నిరసన (Protest at president Rajapaksa's home) చేపట్టారు.
ఈ సందర్భంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకానొక సమయంలో నిరసనకారులు ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే ఇంట్లోకే చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో మిలటరీ రంగ ప్రవేశం చేసి, నిరసనకారులను అడ్డుకుంది. అయినా పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెన్లను ప్రయోగించారు. కొలంబోలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ నిరసనల్లో 10 మంది తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. నిరసనకారులు బస్సును తగలబెట్టారు.
ఇప్పటి వరకూ 45 మంది నిరసనకారులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. అతివాద గ్రూపులు కొన్ని ఈ నిరసనకు సారథ్యం వహిస్తున్నాయని, చాలా మందిని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఆహారం, చమురు, విద్యుత్ విషయంలో శ్రీలంకలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. నిరంతరం విద్యుత్ కోతలతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. రాత్రి సమయంలో వీధి దీపాలను కూడా ఆర్పేస్తున్నారంటే.. పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 గంటల పాటు విద్యుత్ కోత వుంటుందని సర్కార్ ప్రకటించింది. ఇక ముందు 13 గంటల పాటు కూడా కరెంట్ కోతలుంటాయని అధికారులు ప్రకటించారు.