Sri Lanka Political Unrest: శ్రీలంకలో మిన్నంటిన ప్రజాగ్రహం, మొత్తం 26 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా, రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెలిపిన ప్రధాని మహీందా రాజపక్స
Sri Lanka Flog Representative image

Colombo, April 4: శ్రీలంకలో ప్రజాగ్రహానికి 36 గంటల కర్ఫ్యూ తట్టుకోలేకపోయింది. ఎమర్జెన్సీతోపాటు 36 గంటల కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. కాండీలో రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు (Sri Lanka Political Unrest) చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకు రావడంతో అప్రమత్తమైన బలగాలు వారిని నిలువరించడానికి ప్రయత్నించాయి. వారిపైకి జల ఫిరంగులను, బాష్పవాయువును ప్రయోగించాయి. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత (36-Hour Curfew Lifted) చోటుచేసుకుంది.

కర్ఫ్యూని ఉల్లంఘించినందుకు దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లాంటి సోషల్‌ మీడియాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఓవైపు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండటంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. కేంద్ర కేబినెట్‌లోని మొత్తం 26 మంత్రులు తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు మంత్రులు తమ లేఖల్లో పేర్కొన్నారు.

శ్రీలంకలో మిన్నంటిన నిరసనలు, అధ్య‌క్షుడు ఇంటిని చుట్టుముట్టిన 5,000 మంది నిరసనకారులు, రాజ‌ప‌క్సే వెంట‌నే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్

ఆదివారం అర్ధరాత్రి లంక మంత్రులంతా తమ రాజీనామాలను ప్రధాని మహీందా రాజపక్సకు సమర్పించగా.. ప్రధాని పదవికి మాత్రం మహీందా రాజీనామా చేయడానికి సుముఖంగా లేనట్లుతెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం లేదంటే కొత్త కేబినెట్‌.. ఈ రెండు ఆఫ్షన్స్‌లో ఏదో ఒకదాంతో మహీందా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయబోరని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. తాజాగా శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కూడా రాజీనామా చేశారు. అధ్యక్షడు రాజపక్సకు తన రాజీనామా లేఖను అందించారు. కాగా స్వాతంత్ర్యం వచ్చిన 1948 నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో అధిక ధరలు, కరెంట్‌కోతలు, నిత్యావసరాల కొరత.. చూస్తుండడం ఇదేమొదటిసారి. అందుకే ప్రజా వ్యతిరేకత పెల్లుబిక్కింది.