Colombo, July 09: శ్రీ‌లంక ప్రధాని ప‌ద‌వికి ర‌ణిల్ విక్రమ‌సింఘే (Ranil Wickremesinghe) రాజీనామా చేశారు. దీంతో శ్రీ‌లంక‌లో అన్ని రాజ‌కీయ పార్టీల జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నది. శ్రీ‌లంక అధ్యక్షుడు గోట‌బ‌యా రాజ‌ప‌క్సే(Gotabaya Rajapaksa) త‌న అధికార నివాసం నుంచి ప‌రారీ కావ‌డం.. ఆందోళ‌న‌కారులు అధికార కార్యాల‌యంలోకి దూసుకెళ్లడం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ప్రధానిగా విక్రమ సింఘే రాజీనామా(resign) చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్నది. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో(Sri Lanka) నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దాంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిరసనకారులు ఇంటిని చుట్టుముట్టడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పరారవగా.. ప్రధాని రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం రణిల్ విక్రమసింఘే తన రాజీనామాను ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమసింఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే విక్రమసింఘే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామాను ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘దేశ ప్రజల భద్రత సహా ప్రభుత్వ కొనసాగింపు కోసం నేను ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరిస్తున్నా. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత తీవ్ర రూపం దాల్చింది. దాంతో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు.

అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. గొటబాయ నివాస ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టి ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఆ భవనంలో స్విమ్మింగ్‌ పూల్‌లో నిరసనకారులు ఈత కొట్టడం, కిచెన్‌లో వంట చేసుకున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.