Kabul, Dec 13: దాయాది దేశం పాకిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పాక్ ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్ పంక్తున్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటుచేసుకుంది. దారాబన్ ఏరియాలోని ఆర్మీ కార్యాలయంలోకి కొందరు ఉగ్రవాదులు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. పాక్ ఆర్మీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. అనంతరం కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో వేగంగా వచ్చి గేటును ఢీకొట్టారు.
ఈ రెండు దాడుల్లో ఆర్మీ కార్యాలయ భవనం కుప్పకూలింది. ఘటన తర్వాత ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది సైనికులు చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు.
ఈ ఆత్మాహుతి దాడులకు తమదే బాధ్యతంటూ తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)అనుబంధంగా కొత్తగా ఏర్పడ్డ తెహ్రీక్–ఇ–జిహాద్ పాకిస్తాన్(టీజేపీ)ప్రకటించుకుంది. ఇలా ఉండగా, ఇదే జిల్లాలోని దారాజిందా, కులాచి ప్రాంతాల్లో సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ తెలిపింది. ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది.