Islamabad, October 31: రైలులో ఒక ప్రయాణికుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుకు ఎంతో మంది తోటి సామాన్య ప్రజలు సజీవ దహనం అయ్యారు. పాకిస్తాన్ (Pakistan) తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మంటలు చెలరేగడంతో 65 మంది మంటల్లో కాలిపోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ లోని కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ (Tezgam Express) మంటల్లో చిక్కుకుంది. లియాకత్‌పూర్ పట్టణంలోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోకి రాగానే ఒక బోగిలో చెలరేగిన మంటలు, మిగతా బోగీలకు వ్యాపించాయి. దీంతో అక్కడికక్కడే 45 మంది సజీవ దహనం కాగా, మరికొంత మందిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా మరణించారు. ఇంకెంతో మంది గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి రషీద్ ప్రమాదానికి గల కారణాలు తెలిపారు. రైల్లోని ఒక ప్రయాణీకుడు తనతో పాటు తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణం అని చెప్పారు. ఆ ప్రయాణికుడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవడమే కాకుండా, రైల్లోనే అల్పాహారం వండటం ప్రారంభించాడు. దురదృష్టవషాత్తూ ఆ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 3 బోగీలు మంటలకు ఆహుతి అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.