Road accident (image use for representational)

Bangkok, Oct 11: థాయిలాండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో (Bus-Train Collision in Central Thailand) 17 మంది మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఈ దుర్ఘటన (Thailand Bus Accident) చోటు చేసుకుందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు.

మృతులంతా ఓ ప్యాక్టరీకి చెందిన కార్మికులుగా గుర్తించారు. టూరిస్ట్‌ బస్సు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా సరుకు రవాణా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి.

బస్సు పైభాగం విరిగిపడటంతో పట్టాలపై నుంచి క్రైన్‌ సాయంతో తొలగించారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. థాయిలాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. ప్రమాదకరమైన రహదారులు, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, పసలేని చట్టాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్యసంస్థ 2018 నివేదిక ప్రకారం అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు సంభవించే దేశాల్లో థాయిలాండ్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 2018 మార్చిలో ఈశాన్య థాయిలాండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు వెంట చెట్టును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా 12 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.