Bangkok, July 13: థాయ్‌లాండ్ దేశం రేపిస్టులపై కొరడా ఝులిపించింది. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం (Thailand passes bill) తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. సైకియాట్రిక్, అంతర్గత మెడిసన్ స్పెషలిస్ట్‌ల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో కెమికల్ కాస్ట్రేషన్ (chemical castration of sex offenders) చేపడతారు. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులను తగ్గించే ఇంజెక్షన్లు రేపిస్టులకు వేయనున్నారు, ఈ చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది.
హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు'ను థాయ్‌లాండ్ న్యాయశాఖ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 147 సభ్యులతో కూడిన సభలో బిల్లుకు (chemical castration Bill) ఇద్దరు గైర్హాజరు కాగా 145-0 తేడాతో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లు రాయల్ గెజిట్‌లో పబ్లీష్ అయ్యాక చట్టంగా మారనుంది.
కెమికల్ కాస్ట్రేషన్ ఇప్పటికే.. దక్షిణ కొరియా, పాకిస్థాన్, పోలాండ్, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల‍్లో అమలు చేస్తున్నారు. మరోవైపు.. నార్వే, డెన్మార్క్, జర్మనీ వంటి దేశాల్లో సర్జికల్ కాస్ట్రేషన్‌ను పాటిస్తున్నారు. అయితే.. ఈ విధమైన శిక్షలు (voluntary chemical castration of sex offenders) మానవ హక్కులను హరిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కాస్ట్రేషన్ వల్ల ఎదురయ్యే ఫలితాలు
కాస్ట్రేషన్ చేయటం వల్ల నేరస్థుడు తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. కాస్ట్రేషన్ చేయటం వల్ల ఆ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించటం, వివాహద్వేషిగా మారతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, బాలికలను ద్వేషించటం, వారికి హాని కలిగించటం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు.
సెక్స్ అనేది ఒక్కటే దాడికి మార్గం కాదని, ఇతర దారుల్లో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన‍్నారు. ఇక అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని మరోవర్గం వాదిస్తోంది. కాస్ట్రేషన్ భయంతో నేరాలకు పాల్పడేందుకు వెనకడుగువేస్తారని వారు భావిస్తున్నారు.