Ukraine-Russia Tensions: ఉక్రెయిన్ సంక్షోభం, అక్కడి విద్యార్థులు వెంటనే భారత్‌కు తిరిగిరండి, హెచ్చరించిన విదేశాంగ శాఖ, చిక్కుకుపోయిన 20 వేల మంది కోసం బయల్దేరిన ప్రత్యేక విమానం
PUTIN-RECOGNISES-DONETSK-LUGANSK-AS-INDEPENDENT-NATIONS

Kyiv, Feb 22: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ప‍్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక బలగాలు (Ukraine-Russia Tensions) యుద్ధ వినాస్యాలను ప్రదర్శించడం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్‌ వివాదం యుద్ధం చివరి అంచులకు చేరుకోవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత విద్యార్థులు, పౌరుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల భద్రత కోసం ఉక్రెయిన్‌లో ఉన్న కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian embassy in Kyiv once again advises) తాజాగా ఓ సలహాను జారీ చేసింది. ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు తాత్కాలికంగా అక్కడి నుంచి స్వదేశానికి (Indian students to leave Ukraine) తిరిగి రావాలని పేర్కొంది. ఆన్‌లైన్ క్లాసుల్లో నమోదుకు సంబంధించి వారి కళాశాలల నుండి నిర్ధారణ కోసం వేచి ఉండవద్దని కోరింది. అంతకు ముందు ఉ‍క్రెయిన్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల నుంచి తమకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ఎంబసీ అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరులను తరలించేందకు కేంద్రం మంగళవారం ప్రత్యేక విమానాలను అక్కడికి పంపించింది. ఈ విమానాలు ఈరోజు రాత్రికి స్వదేశానికి చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి ఉక్రెయిన్‌ నుంచి ఇండియాకు తొలి బోయింగ్‌ విమానం రానుంది. ఈ మేరకు ఉదయం 7:40 గంటలకు ఓ ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కి బయల్దేరి వెళ్లింది. ఇందులో సుమారు రెండు వందల మంది వరకు ఇండియన్లను తరలించనున్నారు. మరో రెండు విమానాలను సైతం ఎయిర్‌ లిఫ్ట్‌ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది వరకు భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ చెబుతోంది.

రెండు-మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి, సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దాడులకు దిగితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

ఉక్రెయిన్‌లో రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటనతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. తాము గుర్తించిన స్వతంత్ర దేశాల రక్షణ కోసం శాంతి దళలాలను పంపుతామని పుతిన్‌ స్పష్టం చేశారు.తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఆ రాష్ట్రాలకు మిలటరీ సహకారం అందిస్తామని పుతిన్‌ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థులు మరింత క్షణించాయి. రష్యా చర్యపట్ల అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా స్వతంత్ర హోదా ప్రకటించిన రెండు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టడం, వ్యాణిజ్యం చేయడాన్ని నిషేధిస్తున్నామని ప్రకటించింది.

మరోవైపు రష్యాపై నాటో, ఈయూతో పాటు బ్రిటన్‌ కూడా కఠిన ఆంక్షలు విధించాయి. ఇక ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది.