కీవ్, మార్చి 09: రష్యాతో రాజీకి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తమ దేశంపై రష్యా దురాక్రమణను ఆపేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి కారణమైన నాటోలో తమ దేశం చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్టు వెల్లడించారు. రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా రాజీకి జెలెన్‌స్కీ సిద్ధమన్నారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమకు నాటో సహకారం లేదని, అంతర్జాతీయ సమాజం కూడా రష్యా దాడులను ఆపలేక పోయిందన్నారు.
పరిస్థితులు మరింతలా దిగజారి పోతున్నాయని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో నాటోలో చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్టు జెలెన్‌స్కీ తెలిపారు. నాటోపై జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోవియట్ నుంచి విడిపోయిన దేశాల మధ్య నాటో చిచ్చు పెట్టిందని విమర్శించారు.
నిజానికి ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ప్రధాన కారణం ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నాలే. ఇప్పుడు నాటోలో చేరేదే లేదని జెలెన్‌స్కీ ప్రకటించడంతో… రష్యా తన బలగాలను ఉపసంహరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుక్రెయిన్‌పై యుద్ధానికి రెండు రోజుల ముందు డోనెట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది.
ఉక్రెయిన్‌లో రష్యా మరోసారి కాల్పుల విరమణ
పౌరుల తరలింపునకు అనువుగా ఉక్రెయిన్‌లో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. దేశంలోని ఐదు నగరాల్లో కాల్పుల విరమణ అమలు చేయనున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ అయిదు నగరాల్లో పౌరుల తరలింపునకు అనువుగా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేస్తున్నట్లు రష్యా చెప్పింది. బుధవారం ఉదయం 7 గంటల (భారత కాలమానం ప్రకారం) నుంచి ఖార్కివ్, మరియుపోల్, జెపొరిజియా, సుమి, కీవ్, చర్నిహివ్ నగరాల్లో కాల్పులను విరమిస్తున్నట్లు పేర్కొంది. హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రష్యా స్పష్టం చేసింది. మరోపక్క ఉక్రెయిన్‌లో రష్యా దాడులు మొదలై 14వ రోజుకు చేరాయి.