10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో  ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

మరోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే(మార్చి 11 నుంచి మార్చి 31వరకు) జరుగుతాయని సురేశ్‌ తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని ఆయన చెప్పారు. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి సురేశ్‌ తెలిపారు.