New Delhi, March 21: భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌పై (Arunachal Pradesh) చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ.. భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ బుధవారం వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌పై (Arunachal Pradesh) గతకొన్నేళ్లుగా చైనా (China) మొండి వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ అసంబద్ధ వాదనలకు దిగారు. దీన్ని భారత్ దీటుగా తిప్పికొట్టింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయరాని భాగమని, నిరాధార వాదనలను వల్లె వేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్‌కు మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అరుణాచల్‌లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. చైనా- భారత్ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. అయితే, ఈ రాష్ట్రాన్ని చైనా ‘జాంగ్‌నన్ (దక్షిణ టిబెట్)’గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కింది. అది తమ భూభాగమంటూ మళ్లీ పాత పాటే పాడడం మొదలుపెట్టింది.