Washington, November 11: యుఎస్ ను కరోనా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికాలోనే ఎక్కువ కేసులు (US Coronavirus) నమోదవుతున్నాయి. తాజాగా పాత రికార్డులను తిరగరాస్తూ.. గడచిన 24 గంటల్లో రెండు లక్షలకు మించిన కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా కేసుల గణాంక వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. వాటి ప్రకారం ప్రకారం అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 2,01,961 కరోనా కేసులు (Covid in America) నమోదయ్యాయి. అమెరికాలో ఒక్క రోజులో నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యధికం.
ఇదే సమయంలో కరోనాతో 1,535 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. ఇప్పటివరకూ యూఎస్‌లో 1,02,38,243 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకూ 2,39,588 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే ఫైజర్ సంస్థపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండి పడ్డారు. కోవిడ్ నివారణ కోసం ఫైజర్, బయో ఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందన్న విషయాన్ని ఫైజర్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), సంస్థలు కావాలనే దాచిపెట్టాయని ఆయన ఆరోపించారు. తన గెలుపును అడ్డుకునేందుకే ఈ రెండు సంస్థలు టీకా అభివృద్ధిపై ప్రకటనను నిలిపివేసిందన్నారు. కావాలనే ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు రోజుల అనంతరం వ్యాక్సిన్‌పై అప్‌డేట్ వచ్చిందని, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఒకవేళ జో బైడెన్ అధ్యక్షుడిగా ఉంటే వ్యాక్సిన్ వచ్చి ఉండేది కాదని, ఎఫ్‌డిఎ సైతం ఇంత త్వరగా ఆమోదించి ఉండేది కాదని, ఫలితంగా లక్షలమంది ప్రాణాలు పోయేవని ట్రంప్ అన్నారు. ఫైజర్ సంస్థ ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్‌పై ప్రకటన చేస్తారని తాను గతంలోనే చెప్పానని, ఎందుకంటే వారికి అంత ధైర్యం లేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్‌పై ఎఫ్‌డిఎ ముందే ప్రకటన చేసి ఉండాల్సింది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.