Tennessee, AUG 21: జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని చూడటానికి వచ్చిన ఓ యవతి అతనికి లిప్ కిస్ (Lip kiss) పెట్టింది. కిస్ చేశాక ఏమీ తెలియనట్లుగా ఆమె వెళ్లిపోయింది. కానీ కాసేపటికే ఆ ఖైదీ (inmate) చనిపోయాడు. ఆ చనిపోయిన ఖైదీ ఆమెకు ప్రియుడు కావటం గమనించాల్సిన విషయం. మరి ప్రియుడికి ఆమె ముద్దు పెట్టిన కాసేపటికే అతను ఎందుకు చనిపోయిన విషయం తెలిసి జైలు అధికారులే షాక్ అయ్యారు. అమెరికాలోని టేనస్సీలో (Tennessee prison) జరిగిన ఈ సంఘటన వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే.. అది 2022 ఫిబ్రవరి 19వ తేదీ. రాచెల్ డోలార్డ్ (Rachel Dollard) అనే యువతి.. డ్రగ్స్ కేసులో టేనస్సీ జైలులో 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జాషూ బ్రౌన్‌ను కలవటానికి జైలుకు వెళ్లింది. జాషూతో చాలాసేపు మాట్లాడింది. సమయం అయిపోవటంతో తిరిగి వెళ్లిపోతూ ప్రియుడు జాషూకి (Joshua Brown) లిప్ కిస్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె క్యాజువల్ గా వెళ్లిపోయింది. ఈ తరువాతే జరిగింది అసలు విషయం అంతా..
రాచెల్ వెళ్లిపోయిన కాసేపటికి జాషూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన జైలు సెంట్రీలు అధికారులకు విషయం చెప్పారు. దీంతో వెంటనే జాషూని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే జాషూ చనిపోయాడు. జాషూ చనిపోయినట్లుగా డాక్టర్లు కూడా నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్న జాషూ (Joshua Brown) ఆమె వచ్చి వెళ్లిన కాసేపటికే ఎందుకు ఇలా అయిపోయాడు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో భాగంగా జైల్లో ఉన్న సీసీఫుటేజ్ పరిశీలించారు. అంతే షాక్ అయ్యారు. ఏమి ఆమెగారి చాతుర్యం? అంటూ ఆశ్చర్యపోయారు.
రాచెల్.. బాయ్ ఫ్రెండ్ జాషూకు లిప్ కిస్ ఇచ్చినప్పుడు.. ఆమె నోటి నుంచి 0.5 ఔన్స్ మెథాంఫెటామైన్ అనే డ్రగ్ నుంచి జాషూ నోట్లోకి వెళ్లేలా చేసింది. దాన్ని అతడు ఎవ్వరికీ తెలియకుండా బాత్రూమ్ ద్వారా బయటికి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఈలోపే అతడు దాన్ని అనుకోకుండా మింగేశాడు. దీంతో డ్రగ్ ఓవర్ డోస్ అయ్యి.. కాసేపటికే అసస్మారస్థితిలోకి వెళ్లిపోయి మరణించాడు. దీనితో పోలీసులు రాచెల్‌పై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె అసలు ఎందుకు ఇలా చేసిందన్న దానిపై విచారణ చేపట్టారు.