Hyderabad Uber-Ola Cab drivers to go on indefinite strike from Oct 19 (Photo: Ola branch office)

Hyderabad, October 18: తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణాలో 13 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అందరూ ప్రత్యామ్నాయ మార్గాలతో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వర్గం కూడా సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. ఓలా, ఉబర్, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న క్యాబ్స్ ఓనర్లు, డ్రైవర్లు సమ్మెకు దిగనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ తెలిపారు. కాగా రాష్ట్రంలో 50వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఆగస్ట్ 30న తెలంగాణ రవాణాశాఖకు లేఖ అందించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో తాము సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు.

కిలోమీటరుకు కనీస రుసుమును రూ. 22 చేయాలనే డిమాండ్ తో సమ్మెను చేపట్టబోతున్నట్టు చెప్పారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీని ఇవ్వాలని... ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పని చేస్తున్నవారికి జీవో నెంబర్ 61,66 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్యాక్సీ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లపై జరుగుతున్న దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీ అందించాలని, ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తున్నవారికి జీవో నెం. 61,66 అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

క్యాబ్‌ బంద్‌ కారణంగా నగరంలో సుమారు 50 వేలకు పైగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ల సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేలకు పైగా క్యాబ్‌లకు కూడా బ్రేక్‌ పడనుంది. అలాగే హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌ల సమ్మె వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది.