Hyderabad, Sep 24: మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో (Madhapur Drugs Case) కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్ (Drugs) తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్ (Actor Navdeep) చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి వైద్యపరీక్షలకు అయినా తాను సిద్ధమని అన్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్ యాంటీ నారొటిక్స్ బ్యూరో (టీన్యాబ్) విచారణకు హాజరయ్యాడు. శనివారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని హెచ్ న్యూ ఆఫీస్ కు చేరుకున్న నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. గత నెల 31న టీన్యాబ్ పోలీసులు మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దాడులు జరిపి, రామ్‌చంద్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి కాల్‌డాటా ఆధారంగా నవదీప్ ను టీన్యాబ్ పోలీసులు విచారించారు.
డాటా తొలగించినట్టు గుర్తింపు.. ఫోన్ సీజ్
నవదీప్ తన సెల్ ఫోన్ ను తీసుకురాకపోవడంతో టీన్యాబ్ అధికారులు ఫోన్ ను తెప్పించారు. మొబైల్ ను ఫార్మాట్ చేసి సోషల్ మీడియా, గ్యాలరీసహా డాటా మొత్తం డిలీట్ చేసినట్టు గుర్తించారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి, డాటా రిట్రీవ్ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌ను ఆదేశించారు. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’లోని డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లుగా ఉన్న 81 మందితో నవదీప్ కాంటాక్ట్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారమే నవదీప్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.