Disha Encounter Official Trailer (Photo-Varma twitter)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మరో చిత్రం దిశ ఎన్‌కౌంటర్‌. గతేడాది హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ట్రైలర్‌ని కూడా విడుదల చేశాడు. కాగా ఈ మూవీని (Ram Gopal Varma Disha Movie) ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి (Disha Father) హైకోర్టును ఆశ్రయించారు.. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు.

దిశ సంఘటన నేపథ్యంలో సినిమా తీయడాన్ని దిశ తండ్రి ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తమను సంప్రదించకుండా వర్మ సినిమా తీయడం తగదన్నారు. కుమార్తెను కోల్పోయి ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని వాపోయారు. సమాజాన్ని చైతన్య పరచడానికే సినిమా తీస్తున్నానని వర్మ అంటున్నాడని, మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసమే వర్మ సినిమా తీస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్‌లో పెట్టిన ట్రైలర్‌కు వస్తున్న కామెంట్లు మమ్మల్ని బాధిస్తున్నాయన్నారు. సినిమాను వెంటనే బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

దిశ ఎన్‌కౌంటర్‌ ట్రైలర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ, నవంబర్ 26న సినిమా విడుదల, ప్రారంభమైన వర్మ బయోపిక్ షూటింగ్

దిశ ఘటన, ఆ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతుందని, ఈ నేపథ్యంలో ఈ మూవీ నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. అయితే ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరపు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌ రావు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ‌లో 2019 నవంబ‌ర్‌లో జ‌రిగిన దిశ లైంగిక దాడి ఘ‌ట‌న (Disha Murder Case) దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న ఆధారంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్‌’ పేరుతో సినిమా తీస్తున్నారు. గత నెలలో సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల చైంది. రాంగోపాల్‌ వ‌ర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దిశ లైంగిక దాడి ఘ‌ట‌న నేప‌థ్యం, నిందితుల‌ను పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారు..? ఎలా ఎన్ కౌంట‌ర్ చేశారు..? ఈ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఎలాంటి ఆందోళ‌నలు జ‌రిగాయ‌నే విష‌యాల‌ను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.