బాలీవుడ్ (Bollywood)లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Gaming App) కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. కాగా.. రణ్‌బీర్ కపూర్ కూడా శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇక, కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.
అసలు ఏంటీ మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అయితే, నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి.. అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో వీరు నిందితులు కారని, హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే వీరిని విచారించనున్నట్లు సమాచారం.