Hyderabad, November 17: 'జార్జ్ రెడ్డి' (George Reddy) ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు (నవంబర్ 17) జరగాల్సి ఉంది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు, ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరవుతారవుతారని సినిమా యూనిట్ ఇదివరకే ప్రకటించింది. అయితే హైదరాబాద్ పోలీసులు ఈ ఈవెంట్‌కు అనుమతిని నిరాకరించారు. జార్జ్ రెడ్డి సినిమా ఉస్మానియా యూనివర్శిటీలోని ఓ బలమైన విద్యార్థి నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్నో సామాజిక- రాజకీయ అంశాల నేపథ్యంలో తెరకెక్కించబడింది. కాబట్టి ఓయూ (OU) నుంచి విద్యార్థి సంఘాలు భారీగా తరిలివచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హాజరవుతే ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 'లా అండ్ ఆర్డర్' అదుపు తప్పుతుందని అంచనా వేసిన పోలీసులు ఈ ఈవెంట్ కు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయింది. నవంబర్ 22న ఈ జార్జ్ రెడ్డి సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో సందీప్ మాధవ్, ముస్కాన్, సత్య దేవ్ తదితరులు నటించారు.
బలమైన రాజకీయ కోణాలు
'హైదరాబాద్ చెగువెరా' గా ప్రసిద్ధికెక్కిన జార్జ్ రెడ్డి బయోపిక్ సినిమాను పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. పవన్ సోదరుడు నాగబాబు అయితే ఏకంగా జార్జ్ రెడ్డి ఐడియాలజీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఇద్దరిదీ ఒకటేనని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోని గుర్తు, జార్జ్ రెడ్డి యూనియన్ జెండా గుర్తు యాదృచ్చికంగా ఒకలాగే ఉన్నాయని నాగబాబు ఇటీవల పేర్కొన్నారు. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఒకటి మిస్ అయినట్లుగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు, 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్ధతుగా నిలిచిన ఆయన, 2019 ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించారు. ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ అనుకూల స్టాండ్‌ను కొనసాగిస్తున్నారు. ఇక్కడొక విషయం ఏమిటంటే జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు ఒక సెక్యులరిస్ట్, అతడు అప్పట్లో ఆనాటి సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తిగా బీజేపీ విరుద్ధమైన భావజాలం ప్రదర్శించాడు. తాను స్థాపించిన పీడీఎస్‌యూ కూడా బీజేపీ అనుబంధ శాఖలకు విరుద్ధమే. మరి అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ 'జార్జ్ రెడ్డి' సినిమా పట్ల ఆసక్తి కనబరచటంప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేరే అర్థాలకు దారితీస్తుంది. అసలు ఈ జార్జ్ రెడ్డి ఎవరో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేసి అతడి విశేషాలు తెలుసుకోండి.
ఇదిలా ఉంటే, ఓయూ విద్యార్థి సంఘాలు గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించాయి. కెమెరామన్ గంగతో రాంబాబులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అప్పట్లో పెద్ద గొడవలే జరిగాయి. అలాగే పవన్ కళ్యాణ్ మరో సినిమా 'కొమరం పులి' లో టైటిల్ లోని 'కొమరం' పట్ల ఓయూ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. నిజమైన ఉద్యమకారుల పేర్లను తన సినిమాల కోసం వాడుకోవడాన్ని తప్పుపట్టారు. అటు కొమరం వారసులు కోర్టులో కేసు వేయడంతో సినిమా టైటిల్ నుంచి 'కొమరం' పదాన్ని తొలగించారు. ఇప్పుడు అదే ఓయూ స్టూడెంట్ లీడర్, ఒక నిజమైన ఉద్యమకారుడైన 'జార్జ్ రెడ్డి' ని, పవన్ కళ్యాణ్- జనసేనతో నాగబాబు పోల్చటం పట్ల ఓయూ వర్గాల నుంచి ఆశ్చర్యం వ్యక్తం అయింది.
ఇలా, ఇన్నీ విరుద్ధమైన అంశాలు, రాజకీయ కోణాలు ఉండటం కారణం చేతనే ఈ ఇరువర్గాలు ప్రీరిలీజ్ ఈవెంట్లో కలిస్తే ఖచ్చితంగా అది మరో పెద్ద సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి, పోలీసులు అనుమతి నిరాకరించడం సరైన చర్యేనని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.