ఓయూ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి (George Reddy) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం 'జార్జ్ రెడ్డి' . నవంబర్ 22న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ చూసి టాలీవుడ్ నిర్మాత, నటుడు, టీవీ ప్రెజెంటర్ అయిన కొణిదెల నాగబాబు (Konidela Naga Babu) స్పందించారు. ఇప్పటివరకూ ఎన్నో బయోపిక్ చిత్రాలు (Biopics) వచ్చాయి కానీ, అసలు బయోపిక్ అంటే ఇది అని నాగబాబు అన్నారు.
ఒక వీడియోలో నాగబాబు మాట్లాడుతూ "ఈమధ్యన నేను రోడుపై వెళ్తుంటే జార్జ్ రెడ్డి సినిమా పోస్టర్లు చూశాను, ఆసక్తిగా అనిపించి దాని ట్రైలర్ చూశాను. జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీలో ఒక స్టూడెంట్ అని తెలుసు, అతని గురించి 18-20 ఏళ్లుగా వింటూ ఉన్నా, ఈ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ ను పవన్ కళ్యాణ్ తో గానీ, లేదా వరుణ్ తేజ్ తో గానీ చేద్దామని చాలా సార్లు అనుకున్నాను, దానిపై ఆలోచనలు కూడా చేశాను. కానీ ఈలోపే జార్జ్ రెడ్డి కథతో సినిమా వచ్చేసిందని తెలిసింది. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ నాకు ఎంతగానో నచ్చాయి. అయితే అంతే సంతోషం వేసింది. ఒక పాపులర్ ఫేస్ తో ఈ సినిమా చేసేదానికన్నా, తక్కువగా తెలిసిన నటుడితో చేస్తే దాని ప్రభావం వేరు. ఇందులో హీరో సందీప్, నిజంగా జార్జ్ రెడ్డి అనేటట్లుగా చాలా యాప్ట్ అయ్యాడు". అని చెప్పుకొచ్చారు.
Here's George Reddy Official Trailer:
జార్జ్ రెడ్డి కథపై తనకు ఎందుకింత అభిమానమో నాగబాబు చెప్పారు. అతడు ఒక లెజెండరీ స్టూడెంట్ లీడర్,అతడొక రియల్ లెజెండ్. అతడి ఐడియాలజీ ఎంతో గొప్పది. అతడు ఓయూలో చదివే రోజుల్లో ఫిజిక్స్ లో, గణితంలో గోల్డ్ మెడలిస్ట్, ఇస్రోలో ఉద్యోగం వచ్చినా, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం అన్నింటిని త్యాగం చేసి తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నో పోరాటాలు చేశాడు. అసలు ఈ జార్జ్ రెడ్డి ఎవరో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేసి అతడి విశేషాలు తెలుసుకోండి.
అతడు రియల్ ఫైటర్ కూడా, రియల్ లైఫ్ బాక్సింగ్ ఛాంపియన్ ఒక్కడే 20-30 మందిని కొట్టగలడు. జార్జ్ రెడ్డికి అనేక రకాల విద్యల్లో ప్రావీణ్యత ఉంది. అతడు అనుకుంటే ఎక్కడైనా, ఎలాగైనా బ్రతకగలడు కానీ ప్రజల్లో ఉండి, ప్రజలకు సేవ చేయాలని, ప్రజక కోసం నిలబడిన వ్యక్తి జార్జ్ రెడ్డి అని నాగబాబు అన్నారు. తాను కాలేజీ చదువుతున్న రోజుల్లోనే జార్జ్ రెడ్డి అనే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా ఉండటం గర్వకారణం, అలాంటి వ్యక్తి సినిమా వస్తుందంటే, అందరూ చూడాలి అని నాగబాబు చెప్పారు. తాను కూడా జార్జ్ రెడ్డి సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.
జార్జ్ రెడ్డిని కొన్ని దుష్టశక్తులు చంపేశాయి. అతడే గనక బ్రతికుంటే ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండేవాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి కథ వినా, ఆయన గురించి మాట్లాడినా ఎంతో ప్రేరణ, ఉత్తేజం, స్పూర్థి కలుగుతాయి. అతణ్ని చూస్తే నాకు తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి వ్యక్తిత్వం, అతడి పోరాడే తత్వం, అతడి ఎమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లో కనిపిస్తాయి. జార్జ్ రెడ్డి -పవన్ కళ్యాణ్ ఒకే లక్షణాలతో ఉండటం కారణంగానే ఈ ఇద్దరంటే నాకు చాలా ఇష్టం, జార్జ్ రెడ్డి లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక గ్రేట్ లీడర్. అందుకేనేమో జార్జ్ రెడ్డి ఐడియాలజీ నేడు పవన్ కళ్యాణ్ ద్వారా జనాల్లోకి వెళ్తుంది. యాదృచ్చికంగా జార్జ్ రెడ్డి యూనియన్ జెండాలో ఉన్నట్లుగా ఆ పిడికిలి గుర్తు, ఇప్పుడు జనసేన (Janasena) పార్టీ గుర్తులోనూ ఉందని నాగబాబు తెలిపారు. అందరూ జార్జ్ రెడ్డి సినిమా చూడాలని కోరారు. తాను కూడా సినిమా యూనిట్ ను పర్సనల్ గా కలుస్తానని చెప్పారు. ఇకపోతే, జార్జ్ రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రానునట్లు సమాచారం.