మాలో వివాదం (MAA Conflict) మరింతగా ముదిరింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఎన్నికలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. 'మా' అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని అన్నారు. ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు 'మా' కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు. సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు.
వారు ఇకపై మంచు విష్ణు అధ్యక్షతన నడిచే 'మా'లో కొనసాగరని, మంచు విష్ణు తన వాళ్లతో స్వేచ్ఛగా 'మా' కార్యకలాపాలు కొనసాగించవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని, వాటి అమలులో అడ్డు రాకూడదని తమ ప్యానెల్ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మ) పేరుతో కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
‘‘ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలు వచ్చాయి. అలాంటి ఆలోచన లేదు. ‘మా’ అసోసియేషన్ సమస్యలపై స్పందించటానికే నేను వచ్చాను. అవసరమైతే ‘మా’లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం కానీ, మేమేదో 10మందిని తీసుకుని కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచన లేదు. రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో గెలిచిన వాళ్లు పనిచేసే వాతావరణం లేదనే ఉద్దేశంతోనే మా ప్యానెల్ సభ్యులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ల నిర్ణయమే. ఓడినా, గెలిచినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ప్రతినెలా విష్ణు ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతా. మీరు చేసే పనిలో మేము అడ్డుపడం. కానీ, పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తాం’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
అయితే తమను గెలిపించిన ఓటర్లకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, రేపు మంచు విష్ణు పనిచేయకపోతే వారి తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, ఎంతో హుందాగా తీసుకున్న నిర్ణయం అని వివరించారు. తమకు కూడా గణనీయంగా ఓట్లు పడ్డాయని, అందుకే ఓటర్ల తరఫున తాము బాధ్యతగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తన రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు కానివాళ్లు పోటీ చేసేందుకు అనర్హులు అనే నిబంధన తీసుకురాకపోతే తన రాజీనామా వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని అన్నారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న నటుడు శ్రీకాంత్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'మా' ఎన్నికల్లో నరేశ్ అద్భుతంగా వ్యవహరించారని, పరిస్థితులు చూస్తుంటే ఇకపై 'మా' కొత్త కార్యవర్గాన్ని ఆయనే వెనకుండి నడిపిస్తారని అర్థమవుతోందని అన్నారు. గతంలో 'మా' అధ్యక్షుడిగా పనిచేసిన నరేశ్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా 'మా'లో ఆయన హవానే నడుస్తుందన్న అనుమానం కలిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్యానెల్ సభ్యులు 'మా'లో కొనసాగితే రచ్చ తప్పదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
"మా లో నరేశ్ గారే ఉంటారన్న డౌట్ వచ్చింది. ఇలా ఉంటే సమస్యలు వస్తాయని మేం విష్ణుతో కూడా చెప్పాం. మేం పనిచేయాలంటే ఇలాంటి పరిణామాలతో కుదరని పని అని స్పష్టం చేశాం. అయితే విష్ణు చెప్పాల్సింది చెప్పారు. మా సినిమా బిడ్డల ప్యానెల్ లో ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే ఉన్నారు. వారు ప్రశ్నిస్తుంటే వివాదాలు వస్తాయి. అందుకే మేం తప్పుకుంటున్నాం. మంచు విష్ణు తన మేనిఫెస్టో ప్రకారం మా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు" అంటూ వివరణ ఇచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల రోజు తనను మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని నటుడు బెనర్జీ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్ రోజు ఉదయమే వందల మందిలో మోహన్ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు.తనీష్‌ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్‌బాబు కొట్టబోయారు.
పోలింగ్ జరిగే చోట మోహన్‌బాబు అలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఆపలేదు. తనీష్, నాకు చాలా బాధకలిగి కంటతడి పెట్టుకున్నామ. మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు నన్ను బలవంతంగా ఆపారు. మోహన్‌బాబు సతీమణి కూడా ఫోన్ చేసి నన్ను ఓదార్చారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్‌లో ఎందుకు ఉండాలి' అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు.
తాజా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఆధిపత్యం చూపింది. 18మంది సభ్యుల్లో 10మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ(ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్(ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), ఉత్తేజ్(జాయింట్ సెక్రటరీ) ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేశ్ కొండేటి, సమీర్, సుడిగాలి సుధీర్, కౌశిక్ విజయం సాధించారు.
మరోవైపు ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేయకుండానే సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తన డిమాండ్‌ను విష్ణు ప్యానెల్ ముందుంచారు. నరేశ్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, తప్పులు జరిగినట్లు రుజువైతే 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.