సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు (Sushant Singh Rajput Death Case) ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని విచారణకు హాజరకావాలని(Rhea Chakraborty Summoned) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆదివారం ఆదేశించింది. నార్కోటిక్స్ (Narcotics) అధికారుల బృందంతో పాటు ముంబై పోలీసులు ఆదివారం ఉదయం రియా చక్రవర్తి ఇంటికి చేరుకున్నారు.
విచారణకు హాజరు కావాలంటూ మేము రియా చక్రవర్తిని ఆదేశించాం. ప్రస్తుతం ఆమె నివాసంలోనే ఉందని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖండే ప్రకటించారు. విచారణకు ఒంటరిగానైనా లేదా బృందంతో కలిసి రావాలని ఎన్సీబీ సూచించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నాయి.
విష ప్రయోగం వల్లే సుశాంత్ మరణించాడు, సంచలన ఆరోపణలు చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటకు పొక్కడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. వారి నివాసంలో సోదాలు జరిపిన ఎన్సీబీ అధికారులు షోవిక్ ను అరెస్ట్ చేశారు. రియా చక్రవర్తి చెబితేనే తాను మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్ విచారణలో వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ని ఎన్‌సీబీ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేయడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్ తీగలాగితే డొంక కదలినట్టుగా బయటకొస్తోంది.
Rhea Chakraborty Summoned By NCB
#RheaChakraborty has been asked to join the investigation today itself. She has to appear before NCB today: Narcotics Control Bureau (NCB) https://t.co/TsenXdaqjT
— ANI (@ANI) September 6, 2020
ఈ మాదక ద్రవ్యాల రవాణాలో పెద్దచేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోన్న క్రమంలో అనూహ్యమైన విషయాలెన్నో బయటపడుతున్నాయని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సౌత్ వెస్ట్ రీజియన్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని షోవిక్ విచారణలో ఒప్పుకున్నాడని వారు వెల్లడించారు. రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్ డేటా ఆధారంగా ఎన్‌సీబీ నిర్ధారణకు వచ్చింది.
ఇప్పటికే సుశాంత్ సింగ్ వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్‌ని శనివారం అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్ సిండికేట్‌లో షోవిక్‌ను భాగస్వామిగా గుర్తించిన ఎన్‌సీబీ అతను ఇంత భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఎలా సేకరించాడనే విషయాన్ని ఆరా తీస్తోంది. బాంద్రాలోని మోంట్‌బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లోని సుశాంత్ సింగ్ ఫ్లాట్‌ని, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి, సీబీఐ బృందం శనివారం పరిశీలించింది. రాజ్‌పుత్ వంట మనుషులు నీరజ్, కేశవ్, సుశాంత్‌తో కలిసి అదే ఫ్లాట్‌లో నివసించిన సిద్ధార్థ్ పితానిలను సైతం సీబీఐ బృందం తమ వెంట తీసుకెళ్ళింది. ఇదే ఫ్లాట్‌లో జూన్ 14న సుశాంత్ ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే.
షోవిక్ చక్రవర్తి అనేక మందికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని, ఇతనికి మరో నిందితుడు అబ్దుల్ బాసిత్ పరిహార్‌తో సంబంధాలున్నాయని ఎన్‌సీబీ స్థానిక కోర్టుకి వెల్లడించింది. షోవిక్‌ను, సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సీబీ కస్టడీకి కోర్టు అప్పగించింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనేకమార్లు సుశాంత్ ఆత్మహత్యాయత్నాలు చేయడం లాంటి విషయాలపై వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్, ప్రధాన ముద్దాయి రియా చక్రవర్తితో కలిపి షోవిక్‌ను, ముఖాముఖి విచారించాల్సి ఉందని కోర్టుకి ఎన్‌సీబీ తెలిపింది.ఈ కేసులో అరెస్టయిన మరో ముద్దాయి కైజన్ ఇబ్రహీంని కూడా కోర్టులో ప్రవేశపెట్టారు.