ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులున్నాయని..వాటిని పరిష్కరించే వరకు షూటింగ్స్ నిలిపేస్తున్నామని తెలుగు ఫిలిం చాంబర్ (Telugu Film Chamber) అధ్యక్షుడు బసిరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై చర్చించేందుకు నేడు ఫిలిం చాంబర్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రొడ్యూసర్‌గిల్డ్ నిర్ణయానికి ఫిలించాంబర్ మద్దతు తెలిపింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ ( movie shootings Bandh from August 1) చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకే ఆదివారం ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశమైంది.
ఈ సమావేశంలో గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు ఇచ్చింది. 24 క్రాఫ్ట్స్ లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేవరకు షూటింగ్స్ నిలివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ( telugu film chamber of commerce) ప్రకటించింది. రన్నింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్, చిరు 154, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఎన్‌బీకే 107, క్రిష్-పవన్ హరిహరవీరమల్లు, రాంచరణ్-శంకర్ ఆర్‌సీ 15, వంశీపైడిపల్లి-విజయ్, విజయ్‌దేవరకొండ-శివనిర్వాణ ఖుషి, సమంత నటిస్తోన్న యశోద, అఖిల్ చేస్తోన్న ఏజెంట్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.