బిగ్ బాస్-3 ( Big Boss 3) నుంచి నటి పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam) ఎలిమినేట్ అయ్యింది. 11వ వారం రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj), పునర్నవి భూపాలం, వరుణ్ సందేశ్ మరియు మహేశ్ విట్టా నామినేట్ అయ్యారు. అయితే రాహుల్ సేఫ్ అని శనివారం రోజే హోస్ట్ నాగార్జున (Akkineni Nagarjuna) ప్రకటించారు. ఇక ఆదివారం ఇచ్చిన టాస్క్ తర్వాత మహేశ్ మరియు వరుణ్ సేఫ్ అని అనౌన్స్ చేసిన నాగార్జున, పునర్నవి బ్యాగ్ సర్దుకోవాల్సిందిగా స్పష్టంచేశారు. దీంతో పునర్నవి ఎలిమినేట్ అయిపోంది.
నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆదివారం రోజు బిగ్ బాస్ 3 హౌజ్‌లో కంటెస్టంట్స్ అందరికీ నవరసాలు పలికించే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ బాగా ఆకట్టుకుంది, ఒక్కొక్క కంటెస్టంట్ తమ నటనను కనబరిచారు. పునర్నవి శృంగార రసం, రాహుల్ భయానక రసం, వితిక అద్భుత రసం, వరుణ్ శాంత రసం, శివజ్యోతి కరుణ రసం, శ్రీముఖి రౌద్రం, అలీ వీరత్వం, బాబా భాస్కర్ బీభత్సం మరియు మహేశ్ హస్య రసాలను పండించారు. ఈ టాస్క్‌లో శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ మరియు మహేశ్ తమతమ పరిధుల్లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ టాస్క్ పూర్తయిన తర్వాత మరో చిన్న టాస్క్ ద్వారా పునర్నవి ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించారు.
అయితే పునర్నవి ఎలిమినేట్ కావడం పట్ల చాలా మంది బిగ్ బాస్ 3ని ఫాలో అయ్యే మెజారిటీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హౌజ్‌లో అందరికంటే చిన్న వయస్కురాలైన పునర్నవి చాలా సందర్భంల్లో మిగతా వారితో చాలా పొగరుగా వ్యవహరించేది, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ల విషయంలో కూడా తనకు నచ్చితేనే ఆడిది, నచ్చకపోతే హౌజ్‌లో నుంచే బిగ్ బాస్‌ను కూడా ఎదురించేది. బిగ్ బాస్ నాకేమి బాస్ కాదు, నాకు నచ్చినట్లే ఉంటానని తెగేసి చెప్పేది.
పున్నూ బిగ్ బాస్ హౌజ్‌లో చిన్నపిల్లలా ప్రవర్తించే తీరు, ఆమె ఆటిట్యూడ్, తోటి హౌజ్‌మేట్స్‌తో తరచూ గొడవులు హౌజ్‌లోని వారికే కాక, చూసే ప్రేక్షకులకు కూడా విసుగు తెప్పించాయి. బిగ్ బాస్ హౌజ్‌లో ఇచ్చే టాస్క్ లలో కూడా ఆమె అంత పోటీగా ఆడకపోయేది కాదు, దీంతో ఈవారం ఆమెకు ఓట్లు తక్కువగా పోలై హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. పునర్నవి బయటకు వెళ్లడంతో బిగ్ బాస్ షో ఫాన్స్ లైట్ తీసుకున్నారు. ఆమె బయటకు వెళ్లడమే కరెక్ట్ అని సోషల్ మీడియాలో చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, పునర్నవి బయటకు వెళ్లడంతో రాహుల్ మాత్రం వెక్కివెక్కి ఏడ్చాడు.బిగ్ బాస్ 3 హౌజ్‌లో పునర్నవి- రాహుల్ ఇద్దరినీ లవర్స్ అని భావిస్తారు. చాలా సందర్భాల్లో వారి మధ్య సాన్నిహిత్యం ప్రేక్షకుల్లో అలాంటి భావన కల్పించింది. పునర్నవి బిగ్ బాస్ 3 నుంచి బయటకి వెళ్తూ వెళ్తూ హౌజ్‌మేట్స్ అందరినీ పేరుపేరున పలకరించింది, అందరికీ బెస్ట్ విషెస్ చెప్పింది, అయితే రాహుల్‌ను మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ పిలిచినా అతడి వైపు కనీసం చూడకుండా హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున అడిగితే, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కొన్ని విషయాల్లో రాహుల్ ఉండే తీరు నాకు నచ్చలేదు అని ఆ విషయాన్ని దాటవేసింది. బిగ్ బాస్ 3లో లవర్స్‌గా మెలిగిన ఈ ఇద్దరూ బిగ్ బాస్ హౌజ్ బయట కూడా తమ లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి మరి.
ఇకపోతే బిగ్ బాస్ చివరి స్టేజ్‌కి వచ్చేసినట్లే ఇక నుంచి పోటీ జోరుగా ఉంటుంది, ఎలిమినేషన్స్ కూడా జోరుగా ఉంటాయి. బిగ్ బాస్3 సీజన్ పూర్తి అవడానికి ఇంకా కేవలం 4 వారాలు మాత్రమే మిగిలి ఉంది.