Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Amaravati, June 7: ఏపీలో గడచిన 24 గంటల్లో అతి తక్కువ సంఖ్యలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. 64,800 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 4,872 మందికి పాజిటివ్ గా (Coronavirus in AP) నిర్ధారణ అయింది. ఏ ఒక్క జిల్లాలో కూడా కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటలేదు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 961 కరోనా కేసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 810 మందికి కరోనా సోకగా, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 13,702 మంది కోలుకోగా, 86 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,63,211 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,37,149 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,14,510 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11,552కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) కరోనా వైరస్‌ నివారణ చర్యలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా.. గర్భిణులు, చిన్నపిల్లల కోవిడ్‌ చికిత్సపై ( Covid in Childrean) సీఎం జగన్‌ దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పిల్లల వార్డుల అభివృద్ధికి, మెడికల్‌ కాలేజీల్లో పీడియాట్రిక్‌ వార్డుల అభివృద్ధికి ఆదేశించారు. వార్డుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని స్పష్టం చేశారు.

జూన్‌ 20 వరకు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు, జూన్‌ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు, కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

అత్యుత్తమ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. చిన్నపిల్లల కోసం 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, విశాఖ, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి.. ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.పోషకాహార కార్యక్రమం కొనసాగాలని, టీకాల కార్యక్రమం కూడా కొనసాగించాలని అధికారులు కోరారు. వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్, తదితర అంశాలపైనా ముఖ్యమంత్రితో అధికారులు చర్చించారు.

Here's AP Covid Report

థర్డ్‌వేవ్‌ వస్తే పిల్లలపై ప్రభావం, తీవ్రత ఎలా ఉంటుందనే అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పీడియాట్రిక్‌ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. థర్డ్‌వేవ్‌ వస్తుందనుకుని కావాల్సిన మందులు ముందే తెచ్చి పెట్టుకోవాలని అధికారులకు సీఎం తెలిపారు. పిల్లల డాక్టర్లను గుర్తించాలని, వారిని రిక్రూట్‌ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.