Amaravati, June7: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను (Curfew Extended in AP) పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి.
కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియడంతో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Here's ANI Update
Andhra Pradesh government extends statewide curfew till June 20; curfew relation hours 6 am to 2 pm, government offices to function from 8 am to 2pm
— ANI (@ANI) June 7, 2021
నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సోమవారం ఆమె ఏటుకూరులో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత ఉన్న అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా కేవలం రెండేళ్లలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్షా 31 వేల కోట్లు వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశామని, ఎన్నికల్లో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు.
‘‘గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ చాలా తగ్గింది. చిత్తూరు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిని వ్యక్తికి 7 నెలల్లోనే.. ఉరిశిక్ష పడేలా చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. టీడీపీ హయాంలో రిషితేశ్వరి హత్య జరిగితే ఏం చేశారో అందరికీ తెలుసు. దిశ చట్టం కింద 500 కేసుల్లో శిక్షలు ఖరారు చేశాం. విశాఖలో కర్ఫ్యూ సమయంలో బయటికొచ్చిన యువతి వద్ద పాస్ లేదు. అనుమతి పత్రాలు లేకపోవటంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులతో వాదన పెట్టుకుంది. సోషల్ మీడియాలో వచ్చినవే నిజాలు అనుకోకూడదని’’ మంత్రి సుచరిత అన్నారు.