Nellore Krishnapatnam Anandayya Corona medicine (Photo-Twitter_

Krishnapatnam, June 7: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆనందయ్య (Anandaiah Corona Medicine) తయారు చేసిన ఆయుర్వేద మందు పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామని ఆనందయ్య (Anandaiah) తెలిపారు. తయారీ, పంపిణీ మొత్తం ఆనందయ్య భూముల్లోనే చేపడుతున్నారు. అయితే ఎప్పటిలానే జనం క్యూలో కిక్కిరిసి పోయారు. పోలీసులు 144 సెక్షన్‌ ఉందని ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ రద్దీని నియంత్రించారు.

ఇదిలా ఉండగా కరోనా నివారణ మందు (Nellore Corona Ayurvedic Medicine) కోసం ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావద్దని ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ద్వారా ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల వారికి అందజేస్తామన్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెబ్‌సైట్ల ద్వారా కరోనా మందులు అమ్ముకొంటున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన విమర్శలను, ఆనందయ్య మందు పంపిణీ చేయడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. తాను మందు పంపిణీ చేయడం లేదని కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఎవరూ నమ్మవద్దని కోరారు. మందుల తయారీ జరుగుతోందని, నేటి నుంచి పంపిణీ జరుగుతుందని తెలిపారు. తొలుత తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి పరిధిలోని ప్రతి ఇంటికి మందు పంపిణీ చేసిన తర్వాత ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కృష్ణపట్నం కరోనా మందు పేరు ఇకపై ఔషధ చక్రం, ఈ పేరునే పరిగణించాలని కోరిన ఆనందయ్య, రేపటి నుంచి జిల్లాలకు 3 రకాల మందు కిట్లు, సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీకి భూమి పూజ చేసిన ఆనందయ్య

మందును అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్రమంలో సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికిందన్నారు.ఇక ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ మందును చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇందుకు చొరవ తీసుకున్నారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్యుల సహకారం తీసుకున్నారు. ఈ మందు తయారీని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్‌ ఫంగస్‌ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్‌ (పి) మందు మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు.