Anandaiah Coronavirus Medicine (Photo-Twitter)

Nellore, June 6: తాము తయారు చేసిన కరోనా మందును (Anandaiah Corona Medicine) ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందును ఉంచి పూజలు చేయించారు.

అనంతరం ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని (Krishnapatnam Corona medicine distribution) చెప్పారు. తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు.

దమ్ముంటే రా..నువ్వో నేనో తేల్చుకుందాం, సోమిరెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్, ఎమ్మెల్యేకి, మా వెబ్‌సైట్‌కు సంబంధం లేదని తెలిపిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ, నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ

ఇక ఆనందయ్య కరోనా మందుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే సర్వేపల్లి ఎమ్మేల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మధ్య వార్ నడుస్తున్న సంగతి విదితమే. దీనిపై ఆనందయ్య స్పందించారు. కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆయుర్వేద మందు తయారీ నిపుణుడు ఆనందయ్య అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఏదో వెబ్‌సైట్‌ అంటూ విమర్శలు చేస్తున్నారని, సోమిరెడ్డి తనను రాజకీయాల్లోకి లాగడం మాని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని శనివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చిన కొందరిపై లాఠీ చార్జీ చేశారని సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు.

ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకు మార్చిన అధికారులు, ఇక నుంచి కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ, కొరియర్ ద్వారా కృష్ణపట్నం మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఆనందయ్య బృందం

తాను కరోనాకు మందు తయారుచేయడం మొదలుపెట్టి 40 రోజులకు పైగా అయిందని, కొద్ది రోజులపాటు నిలిచిపోయినా.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో మందు తయారీలో నిమగ్నమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందన్నారు. అనుమతులు రావడంతో మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేసి, తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేద్దామనే నిబంధన పెట్టుకున్నామని, అంతేతప్ప వెబ్‌సైట్‌కు కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సోమవారం నాటికి మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఇదిలా ఉంటే టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆయనపై కృష్ణపట్నం పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అనంతరం శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రాజెక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని తెలిపారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు.