Nellore, June 5: కృష్ణపట్నం ఆనందయ్య మందు పేరుతో రూ. రూ.120 కోట్లు సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి (YSRCP MLA Kakani Govardhan Reddy) ప్రయత్నిస్తున్నారనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ మండిపడ్డారు. దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని సవాల్ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే సోమిరెడ్డి నిరూపించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
ఆయుర్వేదంలో ఆనందయ్యకు (Anandayya Ayurvedic Medicine) ఎంతో అనుభవం ఉంది. కొవిడ్ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారు. సోమిరెడ్డి (TDP Leader Somireddy chandramohan reddy) దిగజారి మాట్లాడుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీని జిల్లా కలెక్టర్ నిలిపివేశారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే.. నేరుగా ఆనందయ్యకే చేయవచ్చు. ప్రభుత్వానికి, వైసీపీకి ఆనందయ్య మందుతో సంబంధం లేదు. అన్ని జిల్లాలకు మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనందయ్య మందుకు అనుమతుల కోసం ఎంతో కష్టపడ్డాం’’ అని కాకాని గోవర్దన్ తెలిపారు.
ఆనందయ్య మందు విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసి.. ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు . ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చేవరకే ప్రయత్నం చేశా. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో.. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని కాకాణి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ‘‘సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిగజారి విమర్శలు చేస్తున్నారు. సోమిరెడ్డి ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని నిరూపించలగలవా. వ్యక్తిగత విమర్శలతో సోమిరెడ్డి బురదజల్లాలని చూస్తున్నాడు. సోమిరెడ్డికి నన్ను విమర్శించే హక్కు లేదు. ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డి అప్పుల చిట్టా విప్పుతా. సోమిరెడ్డి పేకాటలో ఎంతమందికి అప్పులు ఉన్నాడో చెప్పాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు.
‘‘సోమిరెడ్డికి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలి. సోమిరెడ్డి ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సోమిరెడ్డి నీతి మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలి’’ అంటూ కాకాణి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి ప్రయత్నం: సోమిరెడ్డి
ఆనందయ్య మందు పేరుతో సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి అంతకుముందు ఆరోపించారు. కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి కుటిల ప్రయత్నం చేశారని ఆరోపించారు. నకిలీ సైట్ క్రియేట్ చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆనందయ్య మందుకు ఫ్యాను గుర్తు పెట్టడం ముఖ్యమంత్రిని దిగజార్చడమే అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్‌లకు లేదన్నారు. సుమోటోగా కుట్రపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. తాము మోమోరాండం ఇవ్వడానికి సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
మే 21 నుండి ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలన్న కుట్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. శ్రేషిత టెక్నాలజీ వద్ద సైట్‌కొని ఇంటర్నెట్‌లో హోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు చెప్పారు. శ్రేషిత కంపెనీలో డైరెక్టర్లు వైసీపీ నాయకులని అన్నారు. సైట్‌లో రూ.15 పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి రూ.167 చేశారని మండిపడ్డారు.
ఆనందయ్య ఆవేశంతో వెనక్కి తీసుకున్నారని.. ఆనందయ్య కుమారుడు సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యే కాకాణి కంగుతిన్నారని అన్నారు. ఇంకా ఆనందయ్యకి స్వేచ్ఛ రాలేదని తెలిపారు. తెలంగాణ నుండి సన్మానించడానికి యాదవ సంగం వాళ్ళు వస్తే పోలీసులతో తరిమిచ్చారని మండిపడ్డారు. ఆనందయ్య మందు పంపిణీకి పర్మిషన్ ఇవ్వమని కోర్టుకి వెళ్తే ప్రభుత్వ లాయర్ అడ్డుకున్నారన్నారు.
శేశ్రిత టెక్నాలజీకి ఎమ్మెల్యేకు సంబంధం లేదు: ఎండీ నర్మదారెడ్డి
ఇదిలా ఉంటే తమ వెబ్‌సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎండీ స్పందించారు. ‘‘ఈ వెబ్‌సైట్ వెనుక ఎలాంటీ దోపిడీ ఉండదు, అంతా పారదర్శకం. టెస్టింగ్ చేసే క్రమంలోనే వెబ్‌సైట్‌లో రేట్లు పెట్టుకున్నాం.. అవి ఫైనల్ కాదు. ఈ అంశాన్ని సోమిరెడ్డి ఇలా రాజకీయం చేయడం దుర్మార్గం. ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు.
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ
లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. ఆ స్థానంలో ప్రభుత్వం సి.రాధాకృష్ణను సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. ఏసీఎస్‌ఆర్ మెడికల్ కాలేజీలో ఈ రెండు కమిటీలు విచారణ చేశాయి. అలానే డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు కూడా ఈ ఘటనపై విచారణ చేశాయి.
కాగా జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపట్టిన సంగతి విదితమే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. ఆయనను నెల్లూరు జీజీహెచ్ బాధ్యతల నుంచి తొలగించారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఆదేశించారు. విచారణ చేపట్టిన రెండు కమిటీలు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి.