BJP MP Gautam Gambhir helps Pakistani child get visa for treatment in India (Photo-ANI)

New Delhi,October 20: బీజెపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఇండియా రావడానికి వీసా వచ్చేలా సహాయం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఉమామియా అలీ అనే ఆరు సంవత్సరాల చిన్నారి ఎప్పటినుంచో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న గంభీర్.. ఆ చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు భారత్‌ వచ్చేలా వీసా ఏర్పాట్లు చేయాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. గంభీర్‌ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి జైశంకర్ వెంటనే స్పందించారు. చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులకు వీసాలు జారీ చేయాలని పాక్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. అనంతరం వారికి వీసాలు జారీ చేసినట్లు గంభీర్‌కు లేఖ రాశారు.

ఆ లేఖను గంభీర్‌ తన ట్విటర్‌లో ఆకట్టుకునే పదాలను జోడించి పోస్ట్‌ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా ఉంది.

గౌతం గంభీర్ ట్వీట్

‘‘అవతలి వైపు నుంచి ఓ చిన్ని హృదయం మనల్ని సంప్రదించినప్పుడు మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. పాక్‌ చిన్నారి భారత్‌కు రావడమనేది ఒక బిడ్డ తన పుట్టింటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇండియాకు వస్తున్న పాకిస్తాన్ చిన్నారికి స్వాగతం.’’. ఈ సంధర్భంగా తన విజ్ఞప్తికి వేగంగా స్పందించి వారికి వీసా వచ్చేలా చేసిన విదేశాంగ శాఖకు గంభీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దీంతో పాటు‘ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ ప్రభుత్వానికి నేను వ్యతిరేకినే కానీ పాకిస్తాన్‌ ప్రజలకు కాదు. ఇంకా లోకం అంటే తెలియని చిన్నారి భారత్‌లో వైద్యం అందుకుని ప్రాణాలు దక్కించుకుంటే అంతకంటే ఆనందమేముంటుంది’అని మరొక ట్వీట్‌ చేశారు.

నేను ఇండియన్ అంటున్న గౌతం గంభీర్

పాక్‌ చిన్నారి వైద్యం కోసం చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేసిన గంభీర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గంభీర్ నీవు క్రికెటర్‌గానే కాదు.. గొప్ప మానవతావదిగా మరోసారి నిరూపించుకున్నావ్‌’, ‘హ్యాట్సాఫ్‌ గంభీర్‌.. నువ్వేంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేశావ్‌’అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.