BRS Harishrao Slams Minister Ponnam Prabhakar(BRS X)

Hyd, Sep 22:  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందన్నారు. నన్ను విమర్శించే పనిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పకోవడం విడ్డూరం. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. పేరుకే బ్యారేజి పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు, రైతులకు ఇచ్చింది లేదు. ప్రాజెక్టు కు సంబంధించిన అనేక అంశాలను గాలికి వదిలేశారు అన్నారు.

ఎఫ్ ఆర్ ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ కాలేదు. పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాల తరలింపు జరగలేదు. కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించలేదు. 144 మీటర్లకు నీరు చేరితే పాత లోలెవెల్ బ్రిడ్జ్ మునిగి పోయేది. రాకపోకలు బంద్ అయ్యేవి. మీ హయాంలో ఎల్లంపల్లి బ్యారేజి పూర్తి అయినా పై కారణాల వలన పూర్తి స్థాయిలో నీరు నింపలేక నిరుపయోగంగా ఉండిపోయింది. తెలంగాణ వచ్చాకనే పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేసి, ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించి, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కాలనీలకు తరలించి, రాజీవ్ రహదారిపై వేగంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్ ఆర్ ఎల్ 148 మీటర్ల వరకు 20 టిఎంసిల నీటిని నింపినం. అది మా ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు.

“తాళం వేసితిని .. గొళ్ళెం మరచితిని” అన్నట్టు మీరు అన్ని ప్రాజెక్టులను అప్పగించినట్టు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా నిరుపయోగంగా మాకు అప్పగించితే దాన్ని రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చినాము. తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, హై లెవల్ బ్రిడ్జీ, రహదార్ల నిర్మాణం కోసం 2,052 కోట్ల రూపాయలు వెచ్చించింది. బరాజ్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’ గా మార్చిన తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభం అయ్యింది. ఇదంతా జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అన్నవాస్తవాన్ని పొన్నం ప్రభాకర్ గారు గుర్తించకపోయినా కరీంనగర్ రైతాంగానికి తెలుసు అన్నారు హరీశ్‌.

“బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ లో భాగమైన ఎల్లంపల్లి, నంది మేడారం, మిడ్ మానెరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి” అని పొన్నం గారు నిజాయితీగా ఒప్పుకున్నందుకు సంతోషం. ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా అలైన్మెంట్ మార్చలేదని మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. CWC సలహాల మేరకు ఈ ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచినాము. మీరు ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులో మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం కేవలం 14 టిఎంసిలే. రీ ఇంజనీరింగ్ తర్వాత 141 టిఎంసిలకు పెరిగింది. ఆ పెరిగిన జలాశయాల్లోకి ఈ రోజు నీటిని నింపగలిగినారు. అవి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినా కూడా మీరు వినియోగించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అయిన సదుపాయాలనే కదా. ఎల్లంపల్లి అప్పుడు ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా ఉండేది. రీ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు కాళేశ్వరంలో భాగం అయ్యింది. అవి కాళేశ్వరంలో భాగం అయిన ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లే అయినా కాళేశ్వరం వ్యవస్థ ద్వారా చేరిన గోదావరి నీళ్లే కదా అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల ప్రక్రియ అర్థం అయితే పొన్నం ఈ రకంగా “ఇవి కాళేశ్వరం నీళ్ళు కావు” అనేవాడు కాదు. కాళేశ్వరంలో ఎత్తిపోతల ప్రక్రియ గురించి కూడా గతంలో అనేక సార్లు వివరించి ఉన్నాను. అయినా అదే పాత పాట పాడుతూనే ఉంటారు. పొన్నం గారు మళ్లీ.. మళ్ళీ చెపుతున్నాను. శ్రీరాంసాగర్ వద్ద వరద ఉంటే, నీటి లభ్యత ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు-1, లింకు-2 లో పంపులు నడుపరు. ఒకవేళ శ్రీరాంసాగర్ వద్ద నీరు లేకపోతే, ఎల్లంపల్లి వద్ద నీటి లభ్యత ఉన్నట్టయితే లింకు-1 లో పంపులు నడపరు. లింకు-2 నుంచే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, అక్కడి నుంచి లింకు-4 లో ఉన్న పంపుల ద్వారా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కు నీటిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు చోట్ల నీరు లేని కాలంలోనే లింకు-1 లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి లింకు-2 లో పంపింగ్ ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుంచి లింకు-4 లో పంపింగ్ ద్వారా ఎగువన ఉన్ననాలుగు జలాశయాలకు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ కు, మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ కు, బస్వాపూర్ కు నీటిని పంపడం జరుగుతుంది. ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న వెసులుబాటు అన్నారు హరీశ్‌ రావు.

ఈ ఏడు శ్రీరాంసాగర్ వద్ద, ఎల్లంపల్లి వద్ద నీటి లభ్యత ఉన్న కారణంగా ఎల్లంపల్లి నుంచే నీటిని పంపింగ్ చేయగలిగినారు. అయితే ప్రకృతి అన్ని సీజన్లలో ఈ రకంగా సహకరించే అవకాశం లేదు. ముఖ్యంగా రబీ సీజన్లో నీటిని మేడిగడ్డ వద్ద నుంచే లిఫ్ట్ చేయవలసి ఉంటుంది. కాళేశ్వరం మొత్తంగా ఒక సమగ్ర గోదావరి వ్యాలీ అభివృద్ది ప్రాజెక్టు గానే చూడాలి తప్ప విడివిడి ప్రాజెక్టులుగా చూడడం అనేది అవగాహనారాహిత్యం అవుతుంది. ఈ సంగతిని పొన్నం, ఇతర కాంగ్రెస్ నాయకులు గమనిస్తే మంచిదన్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో ఒక చిన్న భాగమైన మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయినట్టు, ప్రాజెక్టు మీద ఖర్చు చేసిన లక్ష కోట్లు వృధా అయిపోయాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ నాయకులు అదే కాళేశ్వరం వ్యవస్థను మాత్రం బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నారు. వారు ప్రచారం చేసిన “కాళేశ్వరం ప్రాజెక్టు వృధా” అన్న సిద్ధాంతాన్ని వారే అబద్దమని నిరూపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవధార అని చెప్పకనే చెపుతున్నారు. నేను మొన్నమల్లన్నసాగర్ ను సందర్శించినప్పుడు ఈ మాటనే అన్నాను. నేను నిజాలే చెప్పాను తప్ప మీ లెక్క అబద్దాలు చెప్పలేదు. దానికి పొన్నం భుజాలు తడుముకొని “మేము ఎత్తిపోసింది కాళేశ్వరం నీళ్ళు కావు ఎల్లంపల్లి నీళ్ళు” అని నీళ్ళు నమిలిండు. ఎల్లంపల్లి నీరే అయినా అవి కాళేశ్వరం నీళ్లే.. ఎత్తిపోసింది కాళేశ్వరం పంపింగ్ వ్యవస్త ద్వారానే అని ఒప్పుకోండి పొన్నం గారు. ఇంత అద్భుతంగా పని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం ఎట్లా అవుతుంది ? కాళేశ్వరం ఉపయోగం ఏమిటో రైతాంగానికి, ప్రజలకు తెలుసు. తెలువనిది మీకు, మీ సహచరులకు. తెలువదన్న సంగతి కూడా మీకు తెలువదు అన్నారు.

ఉత్తర తెలంగాణ సీనియర్ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు-1 పునరుద్దరణపై దృష్టి పెట్టాలి. పునరుద్దరణ పనులు పూర్తి చేసి 2025 వానాకాలం పంట కాలానికైనా లింకు-1 ని వినియోగంలోకి తీసుకు రండి. అది కదా మీ ప్రభుత్వం చేయవల్సింది. ఈ పని పూర్తి చేపించి ఉత్తర తెలంగాణ రైతాంగం పట్ల మీ చిత్తశుద్దిని నిరూపించుకోండన్నారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందిందో మీ నీళ్ళ మంత్రి ఉత్తం గారే అసెంబ్లీ వేదికగా వెల్లడించి ఉన్నారు. అప్పుడే మరచిపోయారా పొన్నం గారు ? మళ్ళీ మీ మంత్రి గారు చెప్పిన ఆయకట్టు వివరాలు మీకు గుర్తు చేయదలుచుకున్నాను అన్నారు.

• సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు

• 456 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపడం జరిగింది. ఈ చెరువుల కింద 39,146 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

• శ్రీరాంసాగర్ (స్టేజ్-1 & 2), నిజాంసాగర్, తదితర ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉన్న 2,143 చెరువులను ఆయా ప్రాజెక్టుల కాలువల ద్వారా నింపడం జరిగింది. వీటి కింద 1,67,050 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

• శ్రీరాంసాగర్, లోయర్ మానేరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు కీలక సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తడులకు నీటి సరఫరా జరిగింది. దీనితో ఈ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ & రబీ పంట కాలంలో 17,08,230 ఎకరాలు స్థిరీకరణకు నోచుకున్నాయి. ఈ స్థిరీకరణ 2020 నుంచి 2023 వరకు జరిగింది. స్థిరీకరణ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కాంపొనెంట్.

• లింకు-4 ద్వారా ఎత్తిపోసిన నీళ్ళను కూడేల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాంలను నింపడం ద్వారా 20,576 ఎకరాలకు రెండు పంటలకు నికరంగా సాగునీరు అందింది.

• మొత్తం మీద గత నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థ ద్వారా సుమారు 20,33,572 ఎకరాలకు (కొత్త + స్థిరీకరణ) సాగునీరు అందిందని మీ మంత్రి ఉత్తం గారే అసెంబ్లీ వేదికగా ప్రకటించి ఉన్నారు. ఇది అబద్దమైతే.. ఈ అబద్దాలు చెప్పి శాసన సభ్యులను తప్పుదోవ పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టవలసి వస్తుంది. ఈ విషయం మీద పొన్నం గారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు హరీశ్‌.