PM Narendra Modi interacting with CMs of different state over coronavirus outbreak (Photo Credits: IANS)

New Delhi, April 2 దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాలలో కోవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్ (Lockdown) అమలవుతున్న తీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించారు. రానున్న రాజుల్లో లాక్ డౌన్ మరింత పటిష్ఠంగా అమలు పరచాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. కొన్ని రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ముగింపుపై ప్రధానిని అడగగా, లాక్ డౌన్ ముగిస్తే రాష్ట్రాలు అందుకు సంసిద్ధంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఒక్కసారిగా జనాలకు స్వేచ్ఛ కల్పిస్తే వైరస్ వ్యాప్తి జరగకుండా రాష్ట్రాల వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? ఒక ప్రభావవంతమైన ఉమ్మడి వ్యూహాన్ని కలిగి ఉండం ఎంతో ముఖ్యం అని చెప్పారు.

ప్రతీ ఒక్క భారతీయుడిని వైరస్ నుంచి కాపాడే బాధ్యత మనందరిది, అందుకు ఏం చేయాలో బాగా ఆలోచించి మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా సీఎంలను ప్రధాని కోరారు.

ఇక లాక్ డౌన్ యొక్క రెండవ వారంలో ప్రవేశించిన నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం అని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పట్నించి కరోనా అనుమానితులను వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, ఐసోలేషన్ లో ఉంచడం, క్వారంటైన్లకు తరలిండంపైనే సీరియస్ గా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి దిశానిర్ధేషం చేశారు. క్షేత్ర స్థాయిలో ఇది అమలు జరగాలని ఆయన నొక్కి చెప్పారు. అందుకోసం వెంటనే ఏర్పాట్లు జరగాలనే, ఎక్కడ జిల్లా స్థాయి అధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తూ ఈ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా పోరాటం చేయాలని మోదీ తెలిపారు.

అదే సమయంలో చికిత్స కోసం మరియు వైద్య సిబ్బందికి అవసరమయ్యే వైద్య పరికరాలు మరియు ఔషధాల సరఫరాలో ఎలాంటి కొరత ఉండకుండా చూసుకోవాలని. వీటి ఉత్పత్తి మరియు తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

PM Narendra Modi's Message to State Governments:

ఇక లాక్ డౌన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు రాష్ట్రాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపారు. వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రాలన్నీ ఏకమై కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడంలో భారతదేశం కొంత విజయాన్ని సాధించింది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే ఏమంత సంతృప్తికరంగా లేవని ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాలలో రెండో దశలోనూ వైరస్ వ్యాప్తి సంభావ్యత గురించి హెచ్చరించారు.

నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం ద్వారా దేశంలో కోవిడ్-19 విస్తరిస్తుండటంతో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి, కరోనావైరస్ వ్యతిరేకంగా పోరాటానికి సహకరించాల్సిందిగా వారిని కోరాలని పీఎం మోదీ సూచించారు. అందరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిందిగా ఆయన సూచించారు. అందుకోసం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం లాక్ డౌన్ అతిక్రమించి రోడ్లపైకి వచ్చేవారిపై రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.