EC Bans Exit Polls For Upcoming Assembly Elections, Bypolls On 21 October (Photo-Facebook)

Mumbai,October 15: మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలు, పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై పూర్తి నిషేధం విధించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ దృష్ట్యా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అక్టోబర్‌ 21,2019 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీఐ అధికార ప్రతినిధి ఎస్.శరణ్ ఓ ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈక్రమంలో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సంభాషణలు, ఒపీనియన్‌ పోల్‌, పోల్‌ సర్వే లాంటి విషయాలను ప్రస్తావించడాన్ని నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది.

హర్యానాలో 99, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 24,2019 వెలువడనున్నాయి.

ఈసీఐ అధికార ప్రతినిధి ఎస్.శరణ్ ట్వీట్

వీటితోపాటు బీహార్, అస్సోం, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయా, ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదే రోజున పోలింగ్ జరుగనుంది.వీటితో పాటు మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్టిపూర్ పార్లమెంటరీ నియోజవర్గాలకూ 21వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 24న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అందుకే పోలింగ్ ముగిసేంతవరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.