Representational Image (Photo credits: Pixabay)

Hyderabad, March 11:  వేసవి ప్రారంభం అవడంతో తెలంగాణ (Telangana) రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం ఒంటి పూట బడులను (Half a day schools) ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు దినంలో ఒక పూట వరకు మాత్రమే పనిచేయాలి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఇంఛార్జ్ కమిషనర్ చిత్ర రామచంద్రన్ (Chitra Ramachandran) ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నిబంధనలు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్లలో నడిచే ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనల అమలు విషయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ ఉమ్మడి డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులందరికీ చిత్ర రామచంద్రన్ దిశానిర్దేశం చేశారు.

కాగా, ఒంటి పూట బడులు ప్రారంభమైన దగ్గర్నించీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

ఇక ఏప్రిల్ 23 ఈ విద్యా సంవత్సరానికి చివరిరోజు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12, 2020న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి.