New Delhi, July 3: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూలై నెలలో షెడ్యూల్ చేయబడిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE -2020) మెయిన్స్ మరియు నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET - 2020) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ శుక్రవారం ప్రకటించారు. వీటితో పాటే JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష కూడా వాయిదా పడింది. వాయిదా పడ్డ ఈ పరీక్షలన్నీ సెప్టెంబర్ నెలలో జరుగుతాయని మంత్రి కొత్త తేదీలను విడుదల చేశారు.
కొత్త తేదీల ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జెఇఇ మెయిన్ - ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జరగనున్నాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరుగుతుంది.
ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-2020 పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించనున్నట్లు మంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేశారు.
HRD Minister Announcing New Dates for NEET, JEE 2020:
Keeping in mind the safety of students and to ensure quality education we have decided to postpone #JEE & #NEET examinations. JEE Main examination will be held between 1st-6th Sept, JEE advanced exam will be held on 27th Sept & NEET examination will be held on 13th Sept. pic.twitter.com/klTjtBxvuw
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 3, 2020
కాగా, ఈ ఏడాది JEE మరియు NEET పరీక్షలు వాయిదా పడటం ఇది రెండో సారి. ఇవి వరుసగా ఏప్రిల్ మరియు మే నెలల్లో జరగాల్సి ఉండేవి, అయితే లాక్ డౌన్ కారణంగా జూలై 18 -26 తేదీలకు వాయిదా పడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ మహామ్మారి తీవ్రత తగ్గకపోవడంతో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణపై వాయిదా వేశారు. చాలా మంది విద్యార్థులు విదేశాల్లో కూడా చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పలు వర్గాల నుండి డిమాండ్లు వ్యక్తమయ్యాయి. కొద్ది రోజుల క్రితం పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది.
వీటన్నింటి దృష్ట్యా, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మరోసారి పునరాలోచన చేసిన మానవ వనరుల శాఖ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు మరింత సమయం లభించింది కాబట్టి విద్యార్థులెవ్వరూ ఒత్తిడికి గురి కాకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ సూచించారు.