Representational Image | File Photo

Hyderabad, June 22: తెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఇంజనీరింగ్- అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 (టిఎస్ ఎంసెట్ -2021) ను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 4, 5 మరియు 6 తేదీలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ పరీక్ష అలాగే ఆగస్టు 9 మరియు 10 తేదీలలో అగ్రికల్చర్- మెడిసిన్ స్ట్రీమ్‌ పరీక్ష నిర్వహించబడుతుంది.

ఈ ఏడాది ఆగష్టు చివరి నాటికి పూర్తి చేయాలని ఐసెట్, ఈసెట్ సహా మొత్తం ఏడు సెట్ల పరీక్షల (సిఇటి) ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాలిసెట్ పరీక్ష జూలై 17వ తేదీన, ఈసెట్ ఆగష్టు 3న  జరుగుతుందని ప్రకటించారు.

కాగా, ఐసెట్, లాసెట్ మరియు ఎడ్ సెట్ పరీక్ష తేదీలలో ఎటువంటి మార్పు లేదు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే, ఐసెట్ 2021 ఆగస్టు 19 మరియు 20 తేదీలలో, అలాగే లాసెట్ ఆగస్టు 23వ తేదీన మరియు ఎడ్ సెట్ ఆగస్టు 24 మరియు 25 తేదీలలో జరుగుతున్నాయి.

ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా సెమిస్టర్ పరీక్షలను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ -19 మార్గదర్శకాలను కఠినంగా అమలుపరుస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. డిగ్రీ, పీజీ ప్రత్యక్ష క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు, ఇక ఇంటర్ ఫలితాలు కూడా మరో వారం రోజుల్లోగా విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.