కరోనావైరస్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టతనిచ్చారు. కోవిడ్ బారినపడ్డ స్టూడెంట్స్ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గత నెలలో ఇంటర్ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరోనా బారినపడ్డ విద్యార్థులను పరీక్షకు అనుమతించామని, అలాంటి వారుంటే స్పెషల్ ఎగ్జామ్స్ (TS Inter Special Exams 2021) పెడతామని అప్పట్లోనే ఇంటర్‌బోర్డు ప్రకటించింది.
అయితే ఇప్పటి వరకు ప్రత్యేక పరీక్షల కోసం (Inter Special Examination 2021) విద్యార్థులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొంది. తాజాగా పరీక్షలు ముగియడం, ఈ నెలాఖరున ఫలితాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారినపడ్డ విద్యార్థులెవరూ ప్రత్యేక పరీక్ష కోసం ఇంటర్ బోర్డును సంప్రదించలేదు. దీంతో స్పెషల్ పరీక్షను నిర్వహించే ఆలోచనేది లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు.
ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అంశంపైనా అధికారులు స్పష్టతనిచ్చారు. ఆయా పరీక్షలను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జరపబోమని వెల్లడించారు. ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులందరికీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ, ఇప్పుడు పరీక్షలను నిర్వహించేందుకు సమయం సరిపోకపోవడంతో ఈ అంశాన్ని పక్కనపెట్టారు.