Hyderabad, Nov 3: జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ (JEE Main Notification) ను గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ-NTA) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్ ను (Exam Syllabus) కూడా ప్రకటించింది. ఈసారి సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాలను తొలగించింది. ఫిజిక్స్ లో 14 అంశాలను తీసేసింది. కెమిస్ట్రీలో 25% సిలబస్‌ను, గణితంలో రెండు అంశాలను తొలగించినట్టు ఎన్టీఏ వెల్లడించింది.
జనవరిలో సెషన్-1, ఏప్రిల్ లో సెషన్-2
జేఈఈ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహిస్తారు. జనవరిలో మొదటివిడత, ఏప్రిల్ లో రెండోవిడత పరీక్షలు ఉంటాయని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. 30 రాత్రి 9గంటల వరకు జేఈఈ మొదటివిడత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మొదటివిడత పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి 12న ఫలితాలు ఇవ్వనున్నట్టు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జేఈఈ రెండోవిడత పరీక్షలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నదని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఏప్రిల్ 25న ఫలితాలు విడుదల చేయనున్నట్టు వివరించింది.
రాష్ట్రంలో 11 కేంద్రాల్లో పరీక్షలు
తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు వివరించారు. పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి, మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
అర్హతలు ఇవి..
2022, 2023, 2024 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీయట్ 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.