తెలంగాణలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు (TS Inter supplementary Result 2022 Declared) విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు.ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు.
ఈ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 65.07గా నమోదైంది.అయితే, సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు ఇంటర్ బోర్డు అధికారులు.