Hyderabad, June 9: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను (TS Inter 2nd Year Exams 2021) రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ లో పొందిన మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం, సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణ అంశం మాత్రం కొంతకాలం పెండింగ్‌లో ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ పరీక్షల నిర్వహించేందుకు అనుకూల వాతావరణం లేదని ప్రభుత్వం భావించింది. మరోవైపు థర్డ్ వేవ్ కరోనా ప్రభావం పిల్లలపై ఉంటుందనే భయాందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై చర్చించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయంపై చర్చించారు. అయితే కేబినేట్ భేటీ తర్వాత ఇంటర్ పరీక్షలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఫస్ట్ ఇయర్ మార్కుల ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి తెలియజేశారు. మార్కుల కేటాయింపుపై కమిటీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాలపై సంతృప్తిగా లేని విద్యార్థుల కోసం పరిస్థితులు అనుకూలించిన తర్వాత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు, ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్ ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా కారణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) రద్దుచేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఎన్ఐఓఎస్ 12వ తరగతి పరీక్షలు ఈనెలలో జరగాల్సి ఉన్నాయి. ఆబ్జెక్టివ్ అసెస్‌మెంట్ విధానంలో మార్కులను కేటాయించనుంది. ఈ విధానంతో సంతృప్తి చెందనివారు తర్వాత జరిగే పరీక్షలు రాయవచ్చని అధికారులు వెల్లడించారు.