Hyderabad, August 23: కరోనావైరస్ నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో తెలంగాణ విద్యాశాఖ (TS Education Department) కీలక నిర్ణయం తీసుకున్నది. కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. పాస్ మార్కులు వస్తే చాలు.. ప్రవేశాలు పొందే వీలు కల్పించింది. వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ సహా 7 రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో జనరల్ క్యాటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉండేది.
కాగా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే గతంలో సాధించిన మార్కులు.. లేదంటే కనీస మార్కులతో పాస్ చేశారు. కనీస మార్కుల నిబంధనతో వీరంతా ప్రవేశాలు పొందే అర్హతను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పాస్ మార్కులతోనే ప్రవేశాలు పొందేందుకు వీలుగా అధికారులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం అన్నిరకాల కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు వీలు కలగనున్నది.