Chandigarh, October 24: హర్యానా ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏ పార్టీకి తగిన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ మూడో పార్టీ కీలకం కానుంది. కాంగ్రెస్, బిజెపి మధ్య వార్ నువ్వా నేనా అని సాగుతున్న తరుణంలో అనూహ్యంగా మూడో పార్టీ జేజేపీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ కీలకంగా మారింది. మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి చౌదరి దేవీలాల్ ముని మనవడు అయిన దుష్యంత్ సింగ్ చౌతాలా ఈ సారి హర్యానా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషించనున్నారు.
సోనియా గాంధీ మళ్లీ రాజకీయ చక్రం తిప్పనున్నారా ?
Sources: Congress Interim President Sonia Gandhi has spoken to Senior Congress leader & former Haryana CM Bhupinder Singh Hooda and has taken a stock of latest political situation. pic.twitter.com/YcN1Z7msNv
— ANI (@ANI) October 24, 2019
జననాయక్ జనతాదళ్ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాల కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశాలు ఉన్నట్లుగా పోలింగ్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో వచ్చిన విధంగానే హర్యానాలో ఫలితాలు వెలువడే దిశలో ఉన్నాయి. ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్యానా రాజకీయాల మీదకు తన చూపును మళ్లించారు. హర్యానా మాజీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ లీడర్ భూపేందర్ సింగ్‌తో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చర్చలు జరిపారు. అవసరమయితే పదవి త్యాగానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీకి అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అందివ్వకూడదని వెంటనే జేజేపీతో సంప్రదింపులు జరపాలని పిలుపునిచ్చారు. అవసరమయితే సీఎం పదవి ఆఫర్ చేసేలా చర్చలు ముందుకు తీసుకువెళ్లాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది.
తాజా ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న జేజేపీ.. ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో- అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. జన్ నాయక్ జనతాపార్టీ అధినేత దుష్యంత్ చౌతాలాను మెప్పించడానికి తమ వంతు ప్రయత్నాలు ఆరంభించాయి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు అయిన ఈ కింగ్ మేకర్. ఇదివరకు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ లో కొనసాగారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. సొంతంగా జన్ నాయక్ జనతాపార్టీని స్థాపించారు. ఏడాది కిందటే ఆయన ఈ పార్టీని నెలకొల్పారు. తన తాత దేవీలాల్ కు ఉన్న పేరు ప్రతిష్ఠలను నిచ్చెనగా మార్చుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో.. జన్ నాయక్ జనతా పార్టీ మద్దతు లేనిదే ఏ పార్టీ కూడా అధికారాన్ని అందుకోలేదు. దీనితో దుష్యంత్ చౌతాలా ఏకంగా ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చే పార్టీకే తాను మద్దతు ఇస్తామని దుష్యంత్ చౌతాలా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ.. జేజేపీ మద్దతు లేనిదే అధికారాన్ని అందుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో దుష్యంత్ చౌతాలా డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. దుష్యంత్ చౌతాలా చెప్పిన డిమాండ్లకు బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ అంగీకరిస్తే.. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం ఖాయంగా కనిపిస్తోంది.