Hyderabad, February 11: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో (Gandhi Hospital) మంగళవారం ఓ వైద్యుడు పెట్రోల్ సీసాతో హల్‌చల్ చేశారు. తనను సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా, మనస్తాపంతో డాక్టర్ వసంత్ (Dr. Vasanth) , టీషర్ట్ లోపల పెట్రోల్ బాటిళ్లను బెల్టులాగా అమర్చుకొని వచ్చి, చేతిలో లైటర్ పెట్టుకొని ఒంటికి నిప్పంటించుకుంటానంటూ అక్కడున్న వారిని హెచ్చరించారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.
తాను నిజాయితీగా పనిచేశానని, ఆసుపత్రిలోని తప్పులను ఎత్తిచూపుతున్నందుకే సూపరిండెంట్ తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ డాక్టర్ వసంత్ ఆరోపించారు. ఆసుపత్రిలో ఏ పనిజరగాలన్నా పైఅధికారులకు లంచం ఇవ్వాల్సివస్తుందని నిందించారు.
ఈ క్రమంలో అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రావాలి, సూపరిండెంట్‌ను సస్పెండ్ చేయాలి అంటూ వసంత్ డిమాండ్ చేశారు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు.
దీంతో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అతడి కుటుంబ సభ్యులకూ సమాచారం చేరవేశారు. ముందుజాగ్రత్తగా ఫైర్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు గంటసేపు డాక్టర్ వసంత్ అక్కడున్న వారిని ముప్పుతిప్పలు పెట్టారు. అయితే మొత్తానికి పోలీసులు అతడి ప్రయత్నాన్ని భగ్నం చేసి, ఆ వైద్యుడిని తమ అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇటీవల ఊహగానాలు, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు మీడియాలో రావడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరోనావైరస్ పట్ల ఆందోళన చెందారు. దీంతో నేరుగా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ స్పందిస్తూ, ఆ వార్తలన్నీ అవాస్తవం, పుకార్లు నమ్మకూడదు, మీడియా సంయమనం పాటించాలి అంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పటివరకు ఎవరికీ కరోనావైరస్ నిర్ధారణ కాలేదు.. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ వెల్లడి
అయితే ఇలాంటి వార్తలు బయటకు ఎలా వెళ్లాయని (Coronavirus Cases Leakage Issue) సీరియస్ అయిన ప్రభుత్వం, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గాంధీ ఆసుపత్రి పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో సీనియర్ డ్యూటీ డాక్టర్ వసంత్ తో పాటుగా మరో ముగ్గురు వైద్యులను సోమవారం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో డాక్టర్ వసంత్ ఈరోజు పెట్రోల్ సీసాలతో ఆసుపత్రికి వచ్చి హైడ్రామా క్రియేట్ చేశారు.
కాగా, పుకార్లు వ్యాప్తి చేయడమే కాకుండా, ఏడాది కాలంగా వైద్య సేవలకు డాక్టర్ వసంత్ అంతరాయం కలిగిస్తూ వస్తున్నారని, ఇక ఉపేక్షించడం లాభం లేదనే అతణ్ని సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రవణ్ పేర్కొన్నారు.