Kolkata, Feb 19: వెస్టిండిస్‌తో (West Indies) జరుగుతున్న సిరీస్‌లో భారత్ (India) పైచేయి సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ-20లో (T-20) టీమిండియా గెలుపొందింది. 8 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్, 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్(62), పావెల్(68*) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరి జోడీ 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. పరుగుల వరద పారించారు. వీరి జోరు చూస్తే ఒకానొక సమయంలో టీమిండియాకు ఓటమి తప్పదని అనిపించింది. అయితే 19వ ఓవర్లలో భువనేశ్వర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన పూరన్ ( Pooran) ను ఔట్ చేశాడు. చివరిలో ఓవర్ లో 25 పరుగులు చేయాల్సి ఉండగా విండీస్ 16 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (Bhuvaneswar kumar), యజువేంద్ర చాహల్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
A special 💯 for #TeamIndia in T20Is 💥💥 pic.twitter.com/czrBSeRpR4
— BCCI (@BCCI) February 18, 2022
తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. విండీస్ ముందు 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (52) (Virat Kohli), రిషభ్ పంత్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ( 41 బంతుల్లో 52 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 49/1 స్కోరుతో నిలిచింది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (18) 8వ ఓవర్లో బ్రెండన్ కింగ్‌కి చిక్కి పెవిలియన్ చేరాడు.
కొద్ది సేపటికే సూర్యకుమార్ యాదవ్ (8) కూడా రోస్టన్ ఛేజ్‌కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ అదే ఓవర్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (52), వెంకటేశ్ అయ్యర్ (33) ధాటిగా ఆడారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 3 వికెట్లు తీశాడు. షెల్డన్ కాట్రెల్, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది.