Rohit Sharma at Eden Gardens (Photo Credits: @BCCI/Twitter)

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లోనూ జయకేతనం ఎగురవేసింది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.హిట్టర్ రోహిత్‌ శర్మ (19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) దుమ్మురేపాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడి 61 పరుగులు సాధించాడు. మేయర్స్ 31, కెప్టెన్ పొలార్డ్ 24 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ  రాణించలేకపోయారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 18.5 ఓవర్లలో 162/4 స్కోరు చేసి నెగ్గింది. సూర్యకుమార్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (35) సత్తా చాటారు. చేజ్‌ రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. బిష్ణోయ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. ఆరంభం అదుర్స్‌:ఛేదనలో రోహిత్‌ శర్మ చెలరేగడంతో మ్యాచ్‌ వన్‌సైడ్‌గా మారిపోయింది. రెండో ఓవర్‌లో సిక్స్‌తో బాదుడు మొదలెట్టిన హిట్‌మ్యాన్‌.. విండీస్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు.

తమిళ అమ్మాయితో ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ పెళ్లి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

మరో ఓపెనర్‌ ఇషాన్‌ కూడా వీలుచిక్కినప్పుడల్లా బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్‌ వేసిన 4వ ఓవర్‌లో విరుచుకుపడ్డ రోహిత్‌ 4,6,4,6తో 22 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్‌ రెండు బౌండ్రీలు బాదడంతో టీమిండియా 57/0తో నిలిచింది. అయితే, ధాటిగా ఆడుతున్న రోహిత్‌.. చేజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

రోహిత్ అవుటైన తర్వాత పరుగుల వేగం తగ్గింది. రెండో వికెట్‌కు 29 పరుగులు జోడించిన ఇషాన్‌, విరాట్‌ కోహ్లీ (17) స్వల్ప తేడాతో పెవిలియన్‌కు చేరడంతో కొంత ఉత్కంఠ రేగింది. చేజ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ అవుట్‌ కాగా.. విరాట్‌ను అలెన్‌ వెనక్కిపంపాడు. అయితే, ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండ్రీకి పంపిన సూర్యకుమార్‌ టీమ్‌ స్కోరును సెంచరీ దాటించాడు. చివరి 6 ఓవర్లలో 46 పరుగులు కావాల్సి ఉండగా.. రిషభ్‌ పంత్‌ (8)ను కాట్రెల్‌ అవుట్‌ చేశాడు. కానీ, ఐదో వికెట్‌కు 26 బంతుల్లో 48 పరుగులు జోడించిన సూర్య, వెంకటేష్‌ అయ్యర్‌ (24 నాటౌట్‌).. మరో 7 బంతులు మిగిలుండగానే గెలిపించారు..

స్కోరుబోర్డు:

వెస్టిండీస్‌:

కింగ్‌ (సి) సూర్య (బి) భువి 4, మేయర్స్‌ (ఎల్బీ) చాహల్‌ 31, పూరన్‌ (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 61, చేజ్‌ (ఎల్బీ) బిష్ణోయ్‌ 4, పావెల్‌ (సి) వెంకటేష్‌ (బి) బిష్ణోయ్‌ 2, హుసేన్‌ (సి అండ్‌ బి) దీపక్‌ 10, పొలార్డ్‌ (నాటౌట్‌) 24, స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) హర్షల్‌ 4; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 157/7; వికెట్ల పతనం: 1-4, 2-51, 3-72, 4-74, 5-90, 6-135, 7-157; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-31-1, దీపక్‌ చాహర్‌ 3-0-28-1, హర్షల్‌ పటేల్‌ 4-0-37-2, చాహల్‌ 4-0-34-1, బిష్ణోయ్‌ 4-0-17-2, వెంకటేష్‌ అయ్యర్‌ 1-0-4-0.

భారత్‌:

రోహిత్‌ (సి) స్మిత్‌ (బి) చేజ్‌ 40, ఇషాన్‌ కిషన్‌ (సి) అలెన్‌ (బి) చేజ్‌ 35, కోహ్లీ (సి) పొలార్డ్‌ (బి) అలెన్‌ 17, పంత్‌ (సి) స్మిత్‌ (బి) కాట్రెల్‌ 8, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 34, వెంకటేష్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.5 ఓవర్లలో 162/4; వికెట్ల పతనం: 1-64, 2-93, 3-95, 4-114; బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-35-1, షెఫర్డ్‌ 3-0-24-0, ఓడియన్‌ స్మిత్‌ 2-0-31-0, హుసేన్‌ 4-0-34-0, చేజ్‌ 4-0-14-2, అలెన్‌ 1.5-0-23-1.