New Delhi, February 11: తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సుకి ఉత్తరం, దక్షిణం నుంచి సైనికులను ఉపసంహరించుకునేలా భారత్, చైనా కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు. "గత తొమ్మిది నెలలుగా చైనాతో అనేక చర్చల అనంతరం ఇరువైపులా సైనికుల బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరింది, భారత్ మరియు చైనాలు దశలవారీగా మరియు సమన్వయంతో బలగాల ఉపసంహరణ జరుగుతోంది" అని రక్షణశాఖ మంత్రి వెల్లడించారు.
"పాంగాంగ్ సరస్సుకి ఉత్తరాన ఉన్న ఫింగర్ 8కి తూర్పున చైనా తన దళాలను ఉంచుతుంది. భారతదేశం తన దళాలను ఫింగర్ 3 సమీపంలో ఉన్న శాశ్వత స్థావరంలో ఉంచుతుంది" అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
"తూర్పు లడఖ్‌కు సమీపాన ఎల్‌ఐసి వెంబడి అనేక ప్రదేశాలలో చైనా భారీ ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని సమకూర్చుకుంది. అందుకు ప్రతిచర్యగా భారత్ కూడా తగిన స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది, దేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేందుకు సిద్ధమే అన్నట్లు భారత బలగాలు రుజువు చేశాయి, భారత జవాన్లు సరిహద్దు వెంబడి అత్యంత ధైర్యసాహసాలను కనబరచారు" అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
వాస్తవ నియంత్రణ రేఖ వద్ద శాంతియుత పరిస్థితిని కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధమే, "అని రాజ్ నాథ్ పార్లమెంటులో స్పష్టం చేశారు. ప్రస్తుత ఒప్పందంతో భారత బలగాలు కమాండ్ పోస్టుకు తిరిగి వస్తాయని, అయితే ఈ ఒప్పందంతో భారతదేశానికి ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. "చైనాకు ఒక అంగుళం భూమి కూడా ఇవ్వబోం, యుద్ధానికి వస్తే వెనక్కి తగ్గబోం" అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.