Cyclones In India | Representational Image | (Photo Credits: Wikimedia Commons)

Amaravati, Dec 1: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం (Extreme low pressure) బలపడుతోంది. ఇది నేటి సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది.

ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ తుపాన్‌కు ‘బురేవి’ తుపాన్‌గా (Burevi Cyclone) నామకరణం చేశారు. డిసెంబరు 2న ట్రింకోమలీ వద్ద ఇది తీరం దాటనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సుమారు డిసెంబర్‌ రెండో తేది సాయంత్రం శ్రీలంక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణించి ఆ తర్వాత డిసెంబర్‌ మూడు ఉదయానికి కోమారిన్‌ ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది.

మళ్లీ బురేవి తుఫాన్ దూసుకొస్తోంది, కేరళలో నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్, డిసెంబర్ 2వ తేదీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తమిళనాడుకు తప్పని మరో ముప్పు

ఈ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, కేరళలో 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.