Fog (Photo Credits: PTI)

Hyd, Nov 17: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా (Cold Wave in Telugu States) ఉంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది. ఉదయం చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్‌ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నాలుగు రోజుల్లో (Telangana In Next Four Days) ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్నారు. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు.. తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో ఇప్పుడే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్‌ జిల్లాల్లో చలి బీభత్సంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. వాహనాల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దుప్పట్లు కప్పుకుని మరీ రోడ్లమీదకు రావడం కన్పిస్తుంది.

తెలంగాణను వణికిస్తున్న చలి, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, వచ్చే 3 రోజులు 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం

మరోవైపు ఏపీలోనూ చలి (Cold Wave To Sweep Andhra pradesh) విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ఆ ప్రాంతంలో జనం వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకుని తమను తాము కాపాడుకుంటున్నారు. పాడేరులో 12, మినుములురులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అరుకులోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాబోయే నాలుగు రోజులు చలి విజృంభణ మరింతగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాతి పరిస్థితిని బట్టి మరిన్ని సూచనలు చేస్తామని తెలిపారు.

సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలై ఉదయం 9 గంటల వరకు గజగజలాడిస్తుండడంతో భానుడు బయటకు వచ్చే వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ఇక ఉదయం పది గంటలు దాటినా సూర్యుడు కనపించడం లేదు. ఎండ కోసం జనం పరితపించి పోతున్నారు. పది గంటల వరకూ పొగమంచు కప్పేసుకుంటుంది.

ఇస్రో చరిత్రలో మరో సంచలనం, తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ రేపు నింగిలోకి, ఎర్త్ ఇమేజింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బ్రాడ్‌బ్యాండ్, GPS సేవలను అందిచనున్న విక్రమ్ ఎస్

ఈ చలి ఇలా గజగజా వణికిస్తుంటే ఏపీని మళ్లీ భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం అండమాన్‌కు ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.

ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.