New Delhi, Feb 15: కరోనావైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నియమ నిబంధనలను విడుదల చేసింది. ఆఫీసులు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయనే వార్తల నేపథ్యంలో ఈ గైడ్‌లైన్స్ ను (Coronavirus New Guidelines) కేంద్రం ప్రకటించింది. కార్యాలయాలు ఇతరత్రా పని చేసే ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రామాణిక నియమావళి విడుదల చేసింది.
ఈ నియమ నిబంధనల ప్రకారం కారిడార్లు, ఎలివేటర్లు, స్టెయిర్‌కేస్, వాహనాలు నిలుపదల చేసే చోటు, క్యాంటీన్, కేఫటేరియా, సమావేశాల మందిరాలు తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రామాణిక నియమావళి పాటించాలని మంత్రిత్వశాఖ ఆదేశాల్లో పేర్కొంది. కరోనా (COVID-19 update) వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్నివేళలా ఉండాలని నియమావళిలో తెలిపింది. అలాగే కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆరు అడుగుల దూరం పాటించాలని తెలిపింది. కరోనా లక్షణాలు లేని వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలని పేర్కొంది.
నియమావళి ఇదీ
అన్నివేళలా మాస్కులు ధరించాలి. ముక్కు, నోరు మూసి ఉండేలా మాస్కుల ధరించేలా చూడాలి. మాస్కు ముందుభాగం పదేపదే తాకకుండా చూసుకోవాలి.
కార్యాలయంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వినియోగించాలి.
అధికారి లేదా సిబ్బంది కంటైన్‌మెంట్ జోన్లలో నివశిస్తున్నట్లైతే వారు డీనోటిఫైఅయ్యే వరకూ కార్యాలయానికి రాకూడదు. వారికి ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలి.
డ్రైవర్లు వారికి కేటాయించిన గదుల్లో సామాజిక దూరం పాటించాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే వారిని వాహనం నడపడానికి అనుమతించకూడదు.
వాహనం లోపలి భాగాన్ని రోజుకి రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ లేదా స్ప్రేతో శుభ్రం చేయాలి.
డోర్ హ్యాండిళ్లు, తాళాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
వయసు ఎక్కువ ఉన్నవారు, గర్భిణులు, వైద్య సేవలు పొందుతున్న వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలయాల్లో ఫ్రంట్‌లైన్ పనులకు వారి సేవలు వినియోగించకూడదు.
మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి రానివ్వాలి.
సందర్శకులను పూర్తిగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలి.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలి.
వ్యాలెట్ పార్కింగ్ నిర్వహించే వారు గ్లౌజ్‌లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
కార్యాలయం లోపల , బయట ఉన్న దుకాణాలు, స్టాళ్లు, కేఫటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించేలా చూడాలి.
కనీసం రోజుకి రెండుసార్లు కార్యాలయాల ప్రాంగణం శానిటైజ్ చేయాలి.
వాష్‌రూమ్‌ల్లో ఎళ్లవేళలా శానిటైజర్, సబ్బులు, నీటిప్రవాహం ఉండేలా చూసుకోవాలి.
సీపీడబ్ల్యూడీ నిబంధనలు అనుసరించి ఏసీలు ఎప్పుడూ 24–30డిగ్రీలు, తేమ 40–70శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
కార్యాలయ ప్రాంగణం ఎలా ఉండాలి
కార్యాలయాల్లో కేసులు నమోదైతే కనక సదరు రోగి 48 గంటల క్రితం సందర్శించిన లేదా పనిచేసిన ప్రాంతాలను శానిటైజేషన్ చేయాలి.
ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్గదర్శకాలు అనుసరించి పనులు కొనసాగించొచ్చు.
ఒకవేళ ఆయా కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైతే సదరు బ్లాక్ లేదా భవనం మొత్తాన్ని శానిటైజ్ చేసి తర్వాత కార్యకలాపాలు ప్రారంభించాలి. కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే అధికారులు, సిబ్బంది కార్యాలయానికి సంబంధించిన పర్యవేక్షక అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలి.
కంటైన్‌మెంట్ జోన్ డీనోటిఫై అయ్యే వరకూ కార్యాలయాలకు హాజరుకాకూడదు. ఆయా సిబ్బంది ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి.
కరోనా కేసులు వస్తే ఏం పాటించాలి...
ఆయా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు వస్తే ... అనారోగ్యానికి గురైన వ్యక్తి గది లేదా ప్రాంతం ఇతరులకు దూరంగా ఉంచాలి.
అనారోగ్యానికి గురైన వారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్తే ఆ సమయంలో వారు మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించేలా చూడాలి.
వెంటనే దగ్గర్లోని వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాలకు వారి సమాచారం చేరవేయాలి. వైద్యుల సలహాలు పాటించాలి.
ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం కేసుల నిర్వహణ ఉండాలి.