
Gandhi Nagar, Feb 15: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వైద్యులు సోమవారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆదివారం రాత్రి వైద్యులు ఆయన ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనే ఆయనకు (Gujarat CM Vijay Rupani) కరోనా పాజిటివ్ అని తేలింది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వడోదరాలో ఓ సభలో మాట్లాడుతుండగా వేదికపైనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అస్వస్థతతో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అలిసిపోయి సొమ్మసిల్లి పడిపోయారని బీజేపీ శ్రేణులు తొలుత పేర్కొన్నాయి. అయితే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ (Gujarat CM Vijay Rupani tests positive for coronavirus) అయింది.
కొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన వడోదరాలో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. వేదికపై మాట్లాడుతూ ఆయన స్పృహ కోల్పోయారు. హుటాహుటీన హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో (Ahmedabad hospital) చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఈసీజీ, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని, ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని యూఎన్ మెహతా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ వెల్లడించారు.
మరో వారం రోజులు ఆస్పత్రిలోనే : డిప్యూటీ సీఎం
సీఎం రూపానీకి కరోనా సోకిందని డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ ప్రకటించారు. ఆయన ప్రతిరోజూ ప్రజలను కలుస్తుంటారని, అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా సభలకూ హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాస్త బలహీనంగా ఉండటంతో సభలో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయారని ఆయన తెలిపారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని, కరోనా పాజిటివ్ అని తేలిందని డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పాటిల్ తెలిపారు.
గుజరాత్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కొత్త చట్టం :
గుజరాత్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకువస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. వడోదరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ పేరుతో జరిగే కార్యకలాపాలను కఠినంగా అణిచివేసేలా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు రానున్నాయని, ఇలాంటి వ్యవహారాలను సహించబోమని స్పష్టం చేశారు.
యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇటీవల మత మార్పిడి నిషేధ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో విజయ్ రూపానీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. సామాన్యుడి ప్రయోజనాలను కాపాడేందుకు గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం నేరగాళ్లకు వ్యతిరేకంగా పలు చట్టాలను తీసుకువచ్చిందని సీఎం గుర్తుచేశారు. రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులు, భూ కబ్జాదారులను నియంత్రించేలా పలు చట్టాలను ముందకు తెచ్చామని అన్నారు.